పాక్‌ ప్రధాని సంచలన ప్రకటన | Pak PM Shehbaz Sharif Offers India For Peace Talks | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధాని సంచలన ప్రకటన

May 16 2025 7:26 AM | Updated on May 16 2025 8:40 AM

Pak PM Shehbaz Sharif Offers India For Peace Talks

ఇస్లామాబాద్: భారత్‌ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్‌.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్‌ వెల్లడించారు.

పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ సందర్శించారు. అనంతరం, షరీఫ్‌ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్‌ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పాక్‌ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధం తర్వాత.. పాక్‌ ప్రధాని షరీఫ్‌ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.

ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్‌ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్‌ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement