
జైలు శిక్షను తప్పించుకునేందుకు ఒక మహిళ వింత నాటకానికి తెర తీసింది. దేశంలోని చట్టాలను ఉపయోగించుకొని మరీ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చిన ఘటన వార్తల్లో నిలిచింది. ఆలస్యంగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం 2020లో చెన్ హాంగ్ అనే మారుపేరుతో పిలువబడే మహిళ మోసం కేసులో దోషిగా తేలింది. ఇందుకుగాను ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించకుండా చైనా చట్టంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జైలుకెళ్లకుండానే, తాత్కాలికంగా తమ శిక్షను అనుభవించే వెసులుబాటును ఉపయోగించుకుంది. ఇలాంటి ఖైదీలు జైల్లో కాకుండా సాధారణంగా ఇంట్లో లేదా ఆసుపత్రులలో కమ్యూనిటీ దిద్దుబాటు సెంటర్లలో వీరు ఉండవచ్చు. 2020 - 2024 మధ్య, చెన్ ఒకే పురుషుడితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీ సారి జైలుకెళ్లడం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చైనీస్ చట్టం ప్రకారం, అటువంటి పరిస్థితులలో దోషులు ప్రతి మూడు నెలలకు వైద్య నివేదికలను సమర్పించాలి . స్థానిక కరెక్షన్ సెంటర్లలో క్రమం తప్పకుండా చెకప్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే చెన్ బండారం బైటపడింది.
కానీ మే 2025లో జరిగిన ఒక సాధారణ తనిఖీలో, చెన్ బేబీ కనపించకపోవడంతోపాటు, పిల్లల రిజిస్ట్రేషన్ ఆమె మాజీ భర్త సోదరి పేరుతో నమోదై ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఆమె తొలి సంతానం కూడా తన మాజీ భర్తతో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది చెన్. భర్తకు విడాకులు ఇచ్చి, ముగ్గురు పిల్లలను ఆయనకే ఇచ్చానని ఒప్పుకుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఒక వ్యూహంగా ఉపయోగించుకుందని స్థానిక ప్రొక్యూరేటరేట్ కూడా నిర్ధారించింది.
ఇదీ చదవండి: రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
అయితే ఆమెకు నిర్దేశించిన శిక్షాకాలం ఇక ఏడాది కాలమే మిగిలి ఉండటంతో చెన్‌ను మిగిలిన కాలానికి నిర్బంధ కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గామారింది. కొందరు నెటిజన్లు ఆమెపై జాలి చూపించగా మరికొందరు ఔరా అంటూ నో రెళ్ల బెట్టారు. తల్లి జైలు నుండి తప్పించు కోవాలనే కోరికతోనే జన్మించిన ముగ్గురు పిల్లలపైనా మరికొందరు జాలి చూపించారు. కోరుకున్నప్పుడు గర్భవతి కావడం నిజంగా షాకే అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత