
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.
Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS
— Manish Shukla (@manishmedia) May 17, 2025
తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.