అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్‌: పాక్‌ ప్రధాని ఆవేదన | Shehbaz Sharif Says Pakistan Now In Begging Stage | Sakshi
Sakshi News home page

అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్‌: పాక్‌ ప్రధాని ఆవేదన

Jun 2 2025 7:34 AM | Updated on Jun 2 2025 9:32 AM

Shehbaz Sharif Says Pakistan Now In Begging Stage

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్‌ షరీఫ్‌.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్‌కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్‌ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్‌.. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్‌కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement