
ఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు విషయమై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును షరీఫ్ తప్పుబడుతూ కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు.
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే ప్రధాన కారణం. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం సరైన నిర్ణయం కాదు. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీరీ ప్రజల సంకల్పం, ఆకాంక్షలు మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం. కశ్మీరీల స్వేచ్చను భారత ప్రభుత్వం హరించింది. కశ్మీర్ ప్రజలను మోదీ ప్రభుత్వం అణిచివేసింది. కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో కీలకమైంది. ఆర్టికల్ 370 రద్దు వంటి ఏకపక్ష చర్యలను తిప్పికొట్టడంలో అంతర్జాతీయ సమాజం పాత్ర పోషించాలి’ అని కామెంట్స్ చేశారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా భారతదేశం చర్యకు నిరసనగా పాకిస్తాన్ ఈ రోజును యూమ్-ఇ-ఇస్తేసల్‌గా పాటిస్తోందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Prime Minister Shehbaz Sharif reaffirmed that lasting peace in the region is impossible without resolving the Kashmir issue. He stated that India cannot strip Kashmiris of their right to freedom, the era of oppression will end, and justice will prevail. pic.twitter.com/WjXezNPmgl
— Fizza Butt (@fizzaabutt12) August 5, 2025
మరోవైపు.. పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. పొరుగు దేశాలతో ఘర్షణల కంటే సంభాషణ, దౌత్యాన్ని ఎంచుకుంటుంది. పాకిస్తాన్ ప్రజలు, సాయుధ దళాలు ఏదైనా దురాక్రమణ చర్యకు ధృఢమైన ప్రతిస్పందన అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసి మంగళవారానికి ఆరేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ సహా మరికొన్ని పార్టీలు మంగళవారం బ్లాక్ డేగా పాటించాయి. అలాగే మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు మేరకు మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు కశ్మీర్ వ్యాప్తంగా లైట్లను బంద్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగ విలువలపై దాడిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ మంగళవారం స్థానికంగా నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఎప్పుడిస్తారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక, ఆగస్టు 5వ తేదీన జమ్ము కశ్మీర్‌లో శాంతి, వికాసం, సమాన హక్కులకు బాటలు వేసిన గొప్ప రోజని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ థోకర్ తెలిపారు. దీన్ని ఇతర రాజకీయ పార్టీలు బ్లాక్‌డేగా పాటించడం సరికాదని హితవు పలికారు.