
అరచేతిలో అద్భుతాన్ని చూపించే స్మార్ట్‌ఫోన్లు.. అనర్థాలకు దారితీస్తోంది.. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచి్చన టెక్నాలజీ.. చివరికి మనల్నే తన గుప్పిట్లో బం«దీగా చేస్తోంది. రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు.. రోజువారీ సమస్యలనూ తెచి్చపెడుతోంది.. సరదాగా కాలక్షేపం కోసం మొదట్లో వినియోగంలోకొచ్చి.. ఇప్పుడు అదే కాలక్షేపంగా మారిపోయింది.. అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న మొబైల్ నేడు మన సమయాన్ని వృథా చేస్తోంది.. నెమ్మదిగా దానికి బానిసలుగా మార్చేసుకుంటోంది.. మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోవడాన్ని సైంటిఫిక్‌గా నోమోఫోబియా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోబియాకు గురవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు కేవలం సమాచారానికి, అవసరమైన కమ్యూనికేషన్‌కు మాత్రమే ఉపయోగించుకున్న మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు మన జీవితాల్లో ప్రధాన భాగమైపోయాయి. సోషల్ మీడియా, గేమ్స్, షార్ట్ వీడియోలు, అరచేతిలో టిక్ టిక్ మంటూ వచ్చే నోటిఫికేషన్లతో.. అసలు మొబైల్‌ను మనమే పట్టించుకోవడం లేదు..
అది మనల్ని పట్టేసింది! ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం.. హైదరాబాద్‌లోని విద్యార్థుల్లో 62% మందికి పైగా రోజుకు సగటున 6–8 గంటలు మొబైల్‌లో గడుపుతున్నారని తేలింది. అయితే వ్యసనంలా మారిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.
నగర యువతపై ప్రభావం..
హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్ జాబ్స్, మెట్రో జీవితం, ఒంటరి అపార్ట్‌మెంట్ కల్చర్ తదితర కారణాలతో మొబైల్‌ను ఓ సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మార్చేశాయి.
ప్రత్యేకించి 15–30 ఏళ్ల వయసులో ఉన్న యువతలో ఇది తీవ్రమైన డిజిటల్ డిపెండెన్సీగా మారింది. ముఖ్యంగా రాత్రిపూట స్క్రోల్ చేస్తూ నిద్రపోయే వరకూ ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపం, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు.
సర్వేలు ఏమంటున్నాయంటే..
నిమాన్స్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్) చేసిన అధ్యయనంలో దాదాపు 40% మందికి ‘నో మొబైల్ ఫోబియా’ (నోమోఫోబియా) ఉందని వెల్లడైంది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నారని తేలింది. హైదరాబాద్‌లోని విద్యాసంస్థలు తాము నిర్వహించిన అంతర్గత సర్వేల్లో విద్యార్థులు చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని స్పష్టంగా పేర్కొన్నాయి.
చిన్నారుల్లో దీని ప్రభావం..
పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన వయసులో మొబైల్ స్క్రీన్‌కి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తాత్కాలికంగా వారి తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ అందిస్తుంటే.. అది శాశ్వతంగా పిల్లల అభివృద్ధికి అడ్డుగోడవుతోంది. స్పీచ్ డిలే, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు పిల్లల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి.
విముక్తి మార్గాలు..
డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ : ప్రతి వారం ఒక రోజు లేదా ప్రతి రోజు ఒక నిరీ్ణత సమయం మొబైల్‌కి బ్రేక్ ఇవ్వడం.
ఆఫ్‌లైన్ హాబీస్ : పుస్తక పఠనం, ఆర్ట్, గార్డెనింగ్, యోగా వంటి కార్యకలాపాలు మొబైల్ డిపెండెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి.
సోషల్ మీడియా మేనేజ్మెంట్ : సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం కాదు, వాటిని ‘లిమిటెడ్ యూజ్’ మోడ్‌లో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం.
డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ : స్క్రీన్ టైమ్ ట్రాకింగ్, రిమైండర్లు ఇవ్వగల యాప్స్ ఉపయోగించడం.
ఫ్యామిలీ టైమ్..: ప్రతి రోజు 1–2 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయతి్నంచాలి.
హైదరాబాద్ స్పెషల్ ఇన్షియేటివ్స్..
కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు నెల్లో ఒక్కరోజు ‘నో మొబైల్ డే’ పాటిస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని ఓ స్కూల్ ‘టెక్ ఫ్రీ అవర్’ అంటూ రోజుకు ఒక పిరియడ్‌ను స్క్రీన్ లేని యాక్టివిటీలకు కేటాయిస్తోంది.
సైకలాజికల్ వెల్ బీయింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో మొబైల్ డిపెండెన్సీకి కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నారు.
స్మార్ట్ యూజ్..
ప్రస్తుత అధునాతన జీవన శైలిలో టెక్నాలజీని వదిలేయమనడం సాధ్యం కాదు.. కానీ మనమే నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రించడం ఖాయం. మొబైల్ అనేది ఓ సాధనం మాత్రమే, జీవితం కాదు. ప్రత్యేకించి యువత.. కెరీర్, మానసిక ఆరోగ్యం, రిలేషన్‌షిప్స్ అన్నింటినీ తారుమారు చేసే ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడితేనే నిజమైన ‘స్మార్ట్ యూజ్’ అవుతుంది.