తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్‌ ది హాచ్‌ | What is a Sneez Causes, Symptoms, Treatment | Sakshi
Sakshi News home page

తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్‌ ది హాచ్‌

Aug 5 2025 10:42 AM | Updated on Aug 5 2025 1:32 PM

What is a Sneez Causes, Symptoms, Treatment

తరచుగా తుమ్ములు రావడం, ఛాతీ అంతా నొక్కేసినట్టుగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే సమస్య. సాధారణంగా అలెర్జీలు, జలుబు వంటివి వచ్చినప్పుడు తుమ్ములు ఓ లక్షణంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తుమ్ములు చాలా మామూలు విషయమే గానీ... మరికొన్నిసార్లు 
అవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఓ సూచన కావచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కనిపించే తుమ్ములు ఎందువల్ల వస్తాయో, ఏయే సమయాల్లో అవి తీవ్రమైన సమస్యలకు సూచికగా ఉంటాయో అలాంటప్పుడు అవసరమైన సాధారణ ఇంటి చిట్కాలు మొదలుకొని... పెద్ద సమస్యలకు అవసరమైన చికిత్సలేమిటన్న అనేక అంశాలపై అవగాహన కలిగించే కథనమిది...

ఆవలింతకు అన్న ఉన్నాడుగానీ... తుమ్ముకు తమ్ముడు లేడని ఓ వాడకమాట. అంటే ఒకరు ఆవలించగానే మరొకరికి ఆవలింత వస్తుంది... కానీ తుమ్ము అలాకాదు... సోలోగా వస్తుందని అర్థం. తుమ్ము ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం...

అలెర్జీలు, పుప్పొడి, ధూళిలో ఉండే అతి చిన్న డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (పెట్‌ డ్యాండర్‌),  బూజు వంటివి ఊపిరితిత్తులను ప్రేరేపించి తుమ్ములొచ్చేలా చేస్తాయి.

జలుబు అలాగే ఫ్లూ (కామన్‌ కోల్డ్‌ అండ్‌ ఫ్లూజ్వరం)లో : వైరల్‌ ఇన్ఫెక్షన్ల కారణంతో ముక్కు కారుతుండే సమయంలో; దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో పాటు తుమ్ములూ వస్తుంటాయి. 

నాన్‌–అలెర్జిక్‌ రైనైటిస్‌: ఈ సమస్య ఉన్నప్పుడు అలెర్జీని ట్రిగర్‌ చేసే కారకాలు లేకుండానే వచ్చే తుమ్ములూ, ముక్కు  కారడం వంటి లక్షణాలతో ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వాసనలు, మసాలాలు ఇందుకు కారణమవుతుంటాయి.  

దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యాలు (డస్ట్‌ అండ్‌ పొల్యూషన్‌) : వాతావరణంలోని దుమ్ము, పొగ, వాయుకాలుష్యం వంటి అంశాలు ముక్కులోని అతి  సున్నితమైన పొరలను ఇరిటేట్‌ చేయడం ద్వారా తుమ్ములొచ్చేలా చేస్తాయి. 

బాగా ఘాటుగా ఉండే వాసనలు (స్ట్రాంగ్‌ సెంట్స్‌) : కొన్ని రకాల సెంట్లూ, పెర్‌ఫ్యూమ్‌లూ, శుభ్రం చేయడానికి వాడే సువాసనగల క్లీనింగ్‌ ఉత్పత్తులు లేదా కొన్ని రకాల రసాయనాల తాలూకు ఘాటు వాసనలు తుమ్ములను తెప్పిస్తాయి.

ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపించేలా చేసే ఈ కారణాలన్నీ తుమ్ములతో సంబంధం ఉన్నవే. చాలాసార్లు తుమ్ములు వస్తున్నప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతున్నట్లుగానూ, ఛాతీ బాగా బిగదీసుకుపోయిన ఫీలింగ్‌ కలుగుతుంటుంది. ఇలా ఏయే సమయాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. 

తరచుగా వచ్చే దగ్గుతో (ఫ్రీక్వెంట్‌ కాఫ్‌ వల్ల) : తుమ్ములతోపాటు తరచూ వచ్చే దగ్గు వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. 

అలెర్జిక్‌ ఆస్తమా : అలెర్జీ సమస్య ఉన్న కొందరిలో అదేపనిగా తుమ్ములు వస్తుండటంతోపాటు వాళ్ల శ్వాసనాళాలూ, ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలూ సంకోచించి సన్నబారిపోతుంటాయి. దాంతో గాలి సాఫీగా ప్రవహించడానికీ / ప్రసరించడానికీ తగినంత స్థలం లేకపోవడంతో  శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం (ఆస్తమా) జరగవచ్చు. ఆ శ్వాసనాళాలన్నీ సన్నబారి ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ఛాతీలోనూ బిగుతుగా అనిపిస్తుంది. పిల్లికూతలతోపాటు ఇలా శ్వాస తీసుకోవడం కష్టం కావడాన్నే ఆస్తమాగా పేర్కొంటారు. 

సైనస్‌తో పెరిగే ఒత్తిడి (సైనస్‌ ప్రెషర్‌): ముఖం ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను సైనస్‌ అంటారు. తుమ్ములు, జలుబు లేదా అలెర్జీల వల్ల సైనస్‌లలో ఇన్ఫెక్షన్‌ (అంటే వాపు వచ్చి)  ఆ కారణంగా ఛాతీపై పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. ఇలా సైనస్‌లలో పేరుకు΄ోయిన శ్లేష్మం... ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది.

కండరాల నొప్పి (మజిల్‌ స్ట్రెయిన్‌): తరచుగా తుమ్మడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుండటం వల్ల ఆ కారణంగా నొప్పిగానూ, ఛాతీ బిగుతుగా అనిపించవచ్చు.

తుమ్ములతో ఊపిరితిత్తులపై పడే ప్రభావమిలా...
సాధారణంగా తుమ్మడమనే ప్రక్రియ... ముక్కు లేదా శ్వాసనాళాల్లో అడ్డుగా ఉండి చికాకు కలిగించే కొన్ని వ్యర్థాలనూ, కణాలను బలంగా బయటకు పంపడానికి శరీరం అసంకల్పితంగా చేసే ఓ రక్షణాత్మకమైన ప్రక్రియ. అయితే, తరచుగా, అలాగే తీవ్రంగా, అదేపనిగా తుమ్ములు వస్తున్న కొన్ని సందర్భాల్లో అవి ఊపిరితిత్తులపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఊపిరితిత్తుల కండరాలపై ఒత్తిడి (స్ట్రెయిన్‌ ఆన్‌ లంగ్‌ మజిల్స్‌)

తుమ్మిన ప్రతిసారీ కడుపును రెండు భాగాలుగా విభజించి, ఊపిరితిత్తులనూ, కడుపు తాలూకు జీర్ణవ్యవస్థలోని భాగాల్ని వేరు చేసే డయాఫ్రమ్‌ అనే పొర, ఛాతీ కండరాలూ సంకోచిస్తాయి. ఇలా మరీ ఎక్కువగానూ, శక్తిమంతంగానూ తుమ్ములు వస్తున్నప్పుడు అక్కడి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో ఛాతీలో నొప్పి, అక్కడి కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన నేరుగా ప్రభావం పడదుగానీ... శ్వాసప్రక్రియకు సహాయపడే కండరాలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. 

దాంతో శ్వాస సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. దీన్నే వాడుక భాషలో ఉబ్బసంగా చెబుతుంటారు. శ్వాసనాళాల్లో ఇబ్బంది (ఇరిటేషన్‌), వాపు (ఎయిర్‌ వే ఇరిటేషన్‌ అండ్‌ ఇన్‌ఫ్లమేషన్‌)తుమ్మినప్పుడు గాలి అకస్మాత్తుగా చిమ్మినట్టుగా చాలా వేగంగా బయటకు వస్తుంది. ఇది శ్వాసనాళాల లోపలి పొరల్లో ఇబ్బంది (ఇరిటేషన్‌) కలిగిస్తుంది. 

అలాగే అలెర్జీలూ, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వల్ల తరచుగా తుమ్ములు వస్తున్నట్లయితే, ఈ ఇబ్బంది (ఇరిటేషన్‌) కాస్తా దీర్ఘకాలిక వాపునకు (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌) దారితీసే అవకాశముంది. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ కాస్తా శ్వాసనాళాలను మరింతగా కుంచించుకు΄ోయేలా చేసి, గాలి సాఫీగా ప్రసరించడాన్ని ఆటంకపరుస్తుంది. ఫలితంగా హాయిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.

ఆస్తమాను ప్రేరేపించడం లేదా తీవ్రతరంచేయడం(ట్రిగరింగ్‌ / వర్సెనింగ్‌ ఆస్తమా) : 
ఆస్తమా సమస్య ఉన్నవారిలో తుమ్ములు ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించగలవు... అంటే ట్రిగర్‌ చేయగలవు. అలెర్జీని కలిగించే అంశాలను (అలర్జెన్స్‌ను) దేహం ఎదుర్కొన్నప్పుడు యధేచ్ఛగా తుమ్ములు వస్తూ అవి శ్వాసనాళాలను కుంచించుకుపోయేలా / బిగుసుక΄ోయేలా చేస్తాయి. దాంతో ఛాతీ బిగదీసుకుపోవడం ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావడం జరగవచ్చు. 

అప్పుడు శ్వాసనాళాలు సన్నబారడంతో దగ్గు, ఆయాసం, ఎగశ్వాస, ఛాతీ బిగదీసుకుపోవడం వంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి లేదా వాటిని తీవ్రతరం చేస్తాయి కూడా. తుమ్ములు మరింత ఎక్కువగా వస్తూ, దగ్గు కూడా తోడైనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి బాగా పెరిగి, ఆస్తమా ఉన్నవారికి అది మరింత కష్టంగా పరిణమించవచ్చు.

ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి (స్ప్రెడ్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌):
జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్‌ల వల్ల తుమ్ములు వస్తున్నప్పుడు, అలా  తుమ్మినప్పుడు వెలువడే అతి సన్నటి తుంపర్లలతో వైరస్‌లు ఉంటాయి. ఆ తుంపర్ల కారణంగా వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందడంతో పాటు, కొన్నిసార్లు శ్వాసనాళాల లోపల మరింత లోతుకు విస్తరించి బ్రాంకైటిస్‌ లేదా నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌లకు దారితీయవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలా జరగడం చాలా సాధరణం.

గాలి గదులు ధ్వంసం కావడం లేదా న్యూమోథొరాక్స్‌ : 
ఇది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ప్రమాదం. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తులలోని అంతర్గత  సమస్యలు (ఉదాహరణకు ఎంఫసిమా వంటి సమస్యలు) ఉన్నవారిలో, తుమ్ములు చాలా బలంగా లేదా తీవ్రంగా వస్తున్నప్పుడు ఊపిరితిత్తులలోని అతి చిన్న గాలి గదులు (బ్లెబ్స్‌ అండ్‌ బ్యుల్లే) ఫటేల్మంటూ పగిలినట్టుగా అయ్యే ముప్పు ఉంటుంది. 

అయితే ఇది చాలా అరుదు. అయితే ఇది జరిగితే  దీనివల్ల ఊపిరితిత్తీ అలాగే ఛాతీ గోడకు మధ్యన గాలి లీక్‌ అయి, న్యుమోథొరాక్స్‌ (కొలాప్స్‌డ్‌ లంగ్‌) అనే తీవ్రమైన  కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది చాలా అత్యవసరంగా వైద్యచికిత్స అందించాల్సిన  పరిస్థితి.... అంటే మెడికల్‌ ఎమర్జెన్సీ.

వైద్యచికిత్స ఎప్పుడంటే... 
ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవి... 

గాలి పీల్చడంలో తీవ్రమైన ఇబ్బంది; శ్వాస సరిగా తీసుకోలేక΄ోవడం, ఊపిరి అందక΄ోవడం / ఊపిరాడకపోవడం 

ఛాతీ బిగుసుకు΄ోవడం / ఛాతీలో తీవ్రమైన నొప్పి 

ఒక పట్టాన తగ్గని తీవ్రమైన జ్వరం 

శ్లేష్మం / కఫం పసుపురంగులో లేదా ఆకుపచ్చరంగులో ఉండటం 

ఇక్కడ పేర్కొన్న ఈ లక్షణాలు కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా ఉండటం లేదా మరింత తీవ్రతరమైతే తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

కొన్ని ఇతర వైద్యపరమైన సమస్యలతో కనిపించే లక్షణాలు : 
గుండె సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర  / వైద్య చరిత్ర (హెల్త్‌ అండ్‌  ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు బాగా ఛాతీలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుసుకు΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు. 

తరచుగా తుమ్ములు, ఛాతీలో బాగా బిగదీసుకుపోయి ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తుండటం (ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భాల్లో సమస్య చాలా సాధారణంగా కనిపిస్తున్నా లేదా అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం.

చివరగా... తరచుగా తుమ్ములు రావడమన్నది దాదాపుగా అందరిలోనూ తమ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చే సమస్య. అయితే ఇలా తుమ్ములు పదేపదే కనిపిస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

తుమ్ముల నివారణా... అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలు నివారణకు అనుసరించాల్సిన సూచనలు : 

అలెర్జీకి కారణమయ్యే కారకాల (అలర్జెన్స్‌)ను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం. (అంటే మనకు ఏ కారణంగా అలెర్జీ వస్తుందో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం, అవి ఎదురుకాకుండా చూసుకోవడం; ఇంట్లో అలెర్జెన్స్‌ లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం; దుమ్మూ ధూళి లేకుండా జాగ్రత్తపడటం; పెంపుడు జంతువులూ, వాటి వెంట్రుకల నుంచి దూరంగా ఉండటం. 

డాక్టర్లు సూచించిన మేరకు అలర్జీలను నివారించే నేసల్‌ స్ప్రేలు వాడటం లేదా యోగా ప్రక్రియలో కొమ్ముతో ఉండే చిన్న భరిణె లాంటి ఉద్ధరిణి సహాయంతో ‘నేతి’ అనే యోగప్రక్రియతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకోవడం (ఈ నేతి ప్రక్రియ కారణంగా ముక్కులోని అలెర్జీ కారకాలు (అలర్జెన్స్‌). శ్లేష్మం కొట్టుకుపోయి ముక్కు శుభ్రంగా ఉండటంతో అలెర్జీ, ఆస్తమా నివారితమవుతాయి). 

ఆవిరి పీల్చడం (స్టీమ్‌ ఇన్‌హెలేషన్‌) : వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గడంతోపాటు శ్వాస తేలిగ్గా అందుతుంది. 

నీరూ, ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకోవడం (హైడ్రేటెడ్‌గా ఉండటం) : నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వల్ల శ్లేష్మం (స్ఫుటమ్‌) పల్చబడి అది తేలిగ్గా బయటకు వస్తుంది. (ఈ శ్లేష్మం ఊపిరితిత్తుల్లోనూ, గొంతులోనూ ఇరుక్కుని ఉన్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, ఊపిరితీసుకోడానికి అది అడ్డుపడటం వల్ల చికాకుగా ఉండటం వంటివి చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే). 

ఇంటి చిట్కాలు
తేనె అల్లం కలిపిన పానియాలు : తేనె (హనీ), జింజర్‌ (అల్లం) కలిపి చేసుకున్న పానియాల వల్ల గొంతు నొప్పి తగ్గడం, దగ్గు నుండి ఉపశమనం కలగడం వంటి ఫలితాలుంటాయి. తుమ్ములూ తగ్గుతాయి.

తగినంత విశ్రాంతితో : శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవ్వడంతోపాటు త్వరగా కోలుకోవచ్చు. 

పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం : పొగతాగడం, పొగకు ఎక్స్‌పోజ్‌ అవుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇక పోగ ఎక్కువగా వస్తున్నచోట ఉంటే ఊపిరిసలపనట్టుగా అనిపిస్తుండటం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే పొగ అలవాటుకూ, పొగకూ దూరంగా ఉండటం మేలు. 

(చదవండి: Beauty Tip: మేకప్‌ లేకున్నా...అందంగా కనిపించాలంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement