
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.
ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.
1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.

నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్‌లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
జీపీఆర్ టెక్నాలజీతో..
2003 సమయంలో కోల్‌కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్‌ను కోరుతున్నారు.

జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే..
ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్‌పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా..

జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్‌డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్‌గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి.
తప్పుకున్న జడ్జి
జులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్‌లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.
విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఐటీఆర్‌తో గుట్టురట్టు
ధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.
