breaking news
mass burrials
-
‘ధర్మస్థళ తవ్వకాల’ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో.. తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ధరస్థళ తవ్వకాల వ్యవహారం.. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ క్రమంలో.. ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. డీఎకేఎస్ కామెంట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది.ధర్మస్థళ తవ్వకాలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది. దివారం సుమారు 20 మంది చట్టసభ్యులు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రతో కలిసి ధర్మస్థళ పెద్దలను కలిశారు. వాళ్లు కలిసిన వాళ్లలో ఆలయ ధర్మకర్త, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక పట్టణం విషయంలో జరుగుతున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నిజమైన మంజునాథుడి భక్తుడే అయితే.. జరిగిన ఆ కుట్ర ఏంటో, దానివెనక ఎవరున్నారో బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన సిట్ తవ్వకాలపై మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరో.. ఏదో చెప్పారని.. ప్రభుత్వం తవ్వకాలు చేయించడం ఏంటి?. పోనీ ఇప్పటిదాకా జరిగిన తవ్వకాల్లో ఏమైనా బయటపడ్డాయా? అంటే అదీ లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి.. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. నిజాలు.. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో.. శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలకు దిగారు.వామపక్ష భావజాలం ఉన్న ఓ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్.. ధర్మస్థళపై తప్పుడు ప్రచారానికి దిగింది. హిందువులకు, ధర్మస్థళకు వ్యతిరేకంగా విషప్రచారం చేస్తోంది. ఆ దండుపాళ్య ముఠా చేసిన ప్రచారానికి ప్రభుత్వం తలొగ్గింది. దీనంతటికి సీఎం సిద్ధరామయ్యే కారణం. ఆయన అధికారంలోకి రాకముందు.. వాళ్లంతా అడవుల్లో తిండి కోసం కష్టాలు పడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ధర్మస్థళ ఆలయంపైకే జేసీబీలను నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సౌజన్య కేసులోనో.. సిట్ దర్యాప్తునకో మేం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏవరో ఏదో చెప్పారని సీఎం సిట్‌ను ఏర్పాటు చేయించడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఇధి ధర్మస్థళ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యనే. అందుకే దానినే మేం వ్యతిరేకిస్తున్నాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ధర్మస్థళ వ్యవహారంలో సిట్ మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ సిట్కే ఉందని తేల్చి చెప్పారు. ‘‘ఈ వ్యవహారంలో మధ్యంతర, తుది నివేదిక ఇవ్వడమనేది సిట్ చేతుల్లోనే ఉంది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’’ అని అన్నారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీలో తవ్వకాల వ్యవహారంపై ప్రకటన చేయబోతున్నారు.1995-2014 మధ్య వందలాది హత్యలు జరిగాయని, వాటి మృతదేహాలను తానే ఖననం చేశానంటూ గతంలో ధర్మస్థళ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఓ వ్యక్తి(61) ఆరోపణలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పెద్దల ఆదేశాల మేరకు తాను ఆ పని చేశానంటూ చెప్పుకొస్తున్నాడా వ్యక్తి. ఈ క్రమంలో.. 2022లో ట్రిప్ కోసం ధర్మస్థళకు వెళ్లిన తన 22 ఏళ్ల కూతురు తిరిగి రాలేదంటూ బెంగళూరుకు చెందిన సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేగు(విజిల్ బ్లోయర్ ) ఆరోపణలు, సుజాత ఫిర్యాదు నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఆ వ్యక్తి తొలుత చూపించినట్లు 13 చోట్ల మాత్రమే కాకుండా.. ఆపై గుర్తించిన మరో నాలుగు చోట్ల కూడా సిట్ తవ్వకాలు జరిపించింది. అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాల అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ కనుమల్లో పుట్టిన నేత్రావతి నదీ.. గత దశాబ్దంన్నరకాలంగా తీవ్ర వరదలతో ప్రభావితం అయ్యింది. దీంతో తీర ప్రాంతం కోతకు గురై సమూలంగా మారిపోయిందని, బహుశా ఆ అవశేషాలు కొట్టుకుపోయి ఉంటాయని చెబుతున్నాడతను. మరోవైపు.. సుజాత తన కూతురు అనన్య ఫొటోను తొలిసారిగా మీడియాకు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు మిస్టరీ ఎలా ముగుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
ఆలయ నిర్వాహకులే పూడ్చాలని ఆదేశించారు
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత వివాదాస్పదంగా మారిన మృతదేహాల పూడ్చివేత ఉదంతంలో ధర్మస్థల ఆలయ నిర్వాహకులే గుర్తుతెలియని మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని తనను ఆదేశించారని మాజీ పారిశుద్ధ్యకార్మీకుడు భీమ తాజాగా ప్రకటించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భీమ ఇలాంటి సంచలన విషయాలను తొలిసారిగా పంచుకున్నారు. ‘‘నేను, నాతోపాటు మరికొందరం కలిసి డజన్ల కొద్దీ మృతదేహాలను 1995 నుంచి 2014కాలంలో అటవీ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పూడ్చిపెట్టాం. మృతుల్లో చాలావరకు మహిళలు, చిన్నారులే. ఆనాడు పారిశుద్ధ్యకార్మీకునిగా పనిచేశా. అయితే మృతదేహాలను పూడ్చిపెట్టాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచిగానీ గ్రామపంచాయితీ అధికారులుగానీ ఆదేశించలేదు. కేవలం ధర్మస్థల ఆలయ సమాచార కేంద్రం నిర్వాహకులు, అధికారులే మాకు ఈ ఆదేశాలిచ్చారు. మేం ఏ ఒక్క మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననంచేయలేదు. అన్నింటినీ అడవిలోనే పాతిపెట్టాం. పాత రోడ్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం. బాహుబలి కొండల్లో ఒక మహిళను పూడ్చిపెట్టాం. నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఏకంగా 70 మృతదేహాలను పాతిపెట్టాం. ఇప్పటికే అధికారులు తవ్వకాలు జరిపిన 13వ చోట అయితే నాకు గుర్తుండి దాదాపు 70, 80 మృతదేహాలను పూడ్చిపెట్టాం. కొన్ని సార్లు పూడ్చేటప్పుడు స్థానికులు మమ్మల్ని గమనించారు. కానీ ఎవరూ మాకు అడ్డుచెప్పలేదు’అని ప్రజావేగుగా మారిన భీమ చెప్పారు. లైంగిక వేధింపుల గుర్తులు ‘‘మృతదేహాలను చూస్తే హింసకు, లైంగిక వేధింపులకు గురైనట్లు స్పష్టంగా తెలిసేది. మృతదేహాలపై గాయాలైన గుర్తులుండేవి. హింసించి చంపేశారని అర్థమయ్యేది. కానీ వాస్తవంగా లైంగిక వేధింపులు జరిగాయో లేదో వైద్యనిపుణులే చెప్పగలరు’’అని భీమ అన్నారు. ‘‘చిన్నారుల మొదలు వృద్దుల దాకా అన్ని వయసుల వాళ్ల మృతదేహాలను మేం పూడ్చిపెట్టాం. వంద మృతదేహాల్లో దాదాపు 90 దాకా మహిళలవే. అడవిలో వర్షాల కారణంగా నేల కోతకు గురవ్వడం, అటవీ ప్రాంతందాకా నివాసభవన నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు కొన్ని పూడ్చిన స్థలాలను గుర్తుపట్టడం కష్టమే. గతంలో నేను గుర్తుపట్టడానికి అక్కడో రోడ్డు ఉండేది. జేసీబీ తవ్వకాలతో ఇప్పుడా రహదారి మార్గం గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. గతంలో కొన్ని చోట్ల చెట్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు బాగా చెట్లు పెరిగి ఆ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది’’అని అన్నారు. నేను సిట్‌ను నమ్మినా వాళ్లు నన్ను నమ్మట్లేరు ‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను నేను పూర్తిగా నమ్ముతున్నా. కానీ సిట్ అధికారులు నేను చెప్పేది విశ్వసించట్లేరు. వాళ్ల దర్యాప్తు ధోరణి చూస్తుంటే నాకు విసుగొస్తోంది. నాకు గుర్తున్నమేరకు ఆయా చోట్లను చూపిస్తున్నా. సిట్ అధికారులు పైపైన తవ్వేసి ఏమీ దొరకట్లేదని నాపై నమ్మకం పోగొట్టుకుంటున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన ఆయా ప్రాంతాల్లో మరింత విస్తృతస్థాయిలో తవ్వకాలు జరిపితే ఆధారాలు లభిస్తాయి. 13వ నంబర్ స్పాట్‌సహా కనీసం మరో నాలుగైదు చోట్ల తవ్వాల్సిందే. నాతోపాటు మృతదేహాలు పూడ్చినవాళ్లను సిట్ రప్పిస్తే ఈ వెతుకులాట సులభమవుతుంది. పశ్చాత్తాపంతోనే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ధర్మస్థలకు వచ్చి పచ్చి నిజాలు బయటపెట్టా. కలలో ఎప్పుడూ అస్తిపంజరాలే కనిపించేవి. అనామకులను పూడ్చిపెట్టానన్న పాపభీతి నన్ను వెంటాడింది. ఆ భయం, భారం తగ్గించుకునేందుకు మీడియా ముందుకొచ్చి జరిగిందంతా చెబుతున్నా. పూడ్చిన కళేబరాలకు ఇకనైనా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అంతిమసంస్కారాలు జరగాలని ఆశిస్తున్నా. ధర్మస్థల ఆలయ పరువును మంటగలపడం నా ఉద్దేశం కానేకాదు. నేనెక్కిడికీ పారిపోవాల్సిన అవసరం లేదు. పూడ్చిన ప్రాంతాల గుర్తింపునకు సాయపడతా. తర్వాత నా స్వస్థలానికి వెళ్లిపోతా. మృతదేహాలపై ఉండే బంగారు ఆభరణాలను నేను దొంగతనం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదు. బంగారమే దోచేస్తే ఇన్నాళ్లూ పారిశుద్ధ్యకార్మీకునిగా బతుకీడ్చాలిన అగత్యమెందుకు?. నేను అలాంటి తప్పుడు పనులు చేయను. నేను హిందువును. అందులోనూ షెడ్యూల్డ్ కులస్తుడను’’అని భీమ అన్నారు.70 శవాలను నేనే పూడ్చా ‘‘దాదాపు 70, 80 మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టా. కొన్నింటిని నేలలో చాలా లోతులో పూడ్చిపెట్టాం. మరికొన్నింటిని కొండల మీద పాతిపెట్టాం. ఆలయ ఇన్ఫర్మేషన్ సెంటర్ యాజమాన్యం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే శవాలను పూడ్చిపెట్టాం. ఆలయ మేనేజర్ ఎప్పుడూ నన్ను నేరుగా కలవలేదు. రూమ్ బాయ్ ద్వారా మాకు ఆదేశాలు అందేవి. వాటిని మేం అమలుచేసేవాళ్లం. మేం పూడ్చిన ప్రాంతాల్లోనే భవన నిర్మాణాలు జరిగాయి. అందుకే సిట్ తవ్వకాలు జరిపిన చోట్ల మృతదేహాల ఆనవాళ్లు లభించట్లేదేమో. పట్టపగలే మేం మృతదేహాలను పూడ్చాం’’అని భీమ చెప్పారు. -
‘సిట్ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు ఊహించని మలుపు తిరిగింది. పారిశుధ్య కార్మికుడిగా (విజిల్‌బ్లోయర్) విధులు నిర్వహించే సమయంలో ధర్మస్థళలో వందలాది శవాలను తాను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ (స్థానికులు పిలుస్తున్న పేరు) మీడియా ముందుకు వచ్చారు.ధర్మస్థళలో అవశేషాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తనని నమ్మడం లేదని, నేను వారిని నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు తాను ఖననం చేసిన వారి అస్థిపంజరాలు తన కల్లోకి కూడా వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ కేసు పురోగతిపై ఇండియా టుడే పారిశుధ్య కార్మికుడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను బహిర్ఘతం చేశారు.ధర్మస్థళలో 1995-2014 మధ్య కాలంలో నేను పారిశుధ్య కార్మికునిగా పని చేసే సమయంలో వందల మంది బాధితుల మృతదేహాల్ని ఖననం చేశాను. ఆ మృతదేహాలపై హింస,లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశా. మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ ప్రతినిధులు మాకు ఆ పని పురమాయించారు. మృతదేహాల ఖననం విషయంలో ప్రభుత్వం,గ్రామ పంచాయతీ పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పింది లేదు. ఎవరి మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో.. ఎక్కడ దహనం చేయాలో మొత్తం ఆలయ అధికారులే ఆదేశించారు. అడవులు,నదీ తీరంలో ఖననాలుధర్మస్థళ దేవాలయం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేం మృతదేహాలను ఖననం చేసే వాళ్లం.పూడ్చి పెట్టేవాళ్లం.ఈ పనిలో నాతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు.మహిళల మృతదేహాలను స్మశాన వాటికల్లో కాకుండా అడవుల్లో,పాతబడిన రోడ్లు,నదీ సమీపంలో పాతిపెట్టేవాళ్ళం.మేము బాహుబలి కొండలపై ఒక మహిళను,నేత్రావతి స్నాన ఘాట్‌లో దాదాపు 70 మృతదేహాలను ఖననం చేశాం. నేను చెప్పిన స్పాట్ నెంబర్ 13లో సుమారు 70 నుండి 80 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను ఖననం చేసే సమయంలో స్థానికులు మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్లెప్పుడూ జోక్యం చేసుకోలేదు.పై నుంచి ఆదేశాలు వచ్చేవి. మృతదేహాలను ఖననం చేసేవాళ్లం. అదే మా పని.ధర్మస్థల ఆలయం నుండి కిలోమీటర్ దూరంలో ఓ కొండపైన దిగంబర్ జైన విగ్రహం ఉంది. దానిని బాహుబలికొండ అని పిలుస్తారు. దిగంబర్ జైన్ విగ్రహం చేరుకోవాలంటే కింది నుంచి 300మెట్లు ఎక్కాల్సి ఉంది.100 మృతదేహాలలో 90 వారివేఖననం లేదంటే దహనం చేసిన మహిళలు,యువతులు,బాలికల మరణానికి కారణాలేంటనేది చెప్పలేదు. అయితే ఆ మృతదేహాలపై హింస, లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కొన్ని మృతదేహాలపై స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వారిపై దాడి జరిగినట్లు అనిపించింది. బాధితులపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది వైద్యలు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాల్లో పిల్లలు,వృద్ధుల ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఉండగా.. ఖననం చేసినట్లు పేర్కొన్న 100 మృతదేహాలలో 90 మంది వారే ఉండటం గమనార్హం.మారిన స్థలాలు..ఆధారాలు మాయం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో నాడు ఖననం చేసిన ప్రాంతాల వరకు ఆచూకీ కనిపించడం లేదు. 1995-2014 మధ్య కాలంలో మృతదేహాలను ఖననం చేసే సమయంలో ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేవి. ఇప్పుడు ఎటుచూసినా చెట్లు మొలిచాయి. నిర్మాణాలు ఏర్పడ్డాయి.అయినప్పటికీ వాటిల్లో ఓ పాత రహదారి ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. కాకపోతే ఆ ప్రాంతం అంతా అడవిలా మారింది. ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలు గుర్తించాను. జేసీబీ సాయంతో మరిన్ని మృతదేహాలను గుర్తిస్తానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.మీరు వందల మందిని ఖననం చేశామని చెబుతున్నారు సరే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం 13 ప్రదేశాల్లో పాక్షికంగా మృతదేహాల అవశేషాలను గుర్తించింది. వారిలో ఒక పురుషుడు మాత్రమేనని తెలుస్తోంది.మరి మిగిలిన మృతదేహాల మాటేమిటీ అని ప్రశ్నిస్తే.. బాధితుల్ని ఖననం చేసింది మేమే.. నేను నిజమే చెబుతున్నాను అని తనని తాను సమర్ధించుకున్నారు.‘నేను సిట్‌ను నమ్ముతాను..సిట్ నన్ను నమ్మదు’ఈ సందర్భంగా సిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారిలో సిట్ బృందానికి ఐపీఎస్ డాక్టర్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఐపీఎస్ అధికారాలు అనుచేత్,జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికంలు ఉన్నారు. వీరితో పాటు వైద్య పరీక్షల కోసం మంగళూరు కేఎంసీ వైద్యులు,అవశేషాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఉన్నారు. ఇప్పుడు అదే సిట్‌ను మాజీ పారిశుధ్యకార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్ బృందాన్ని తాను నమ్ముతున్నట్లు.. వారి విధానంపై నిరాశను వ్యక్తం చేస్తూ.. నేను సిట్‌ను నమ్ముతాను. వాళ్లు నన్ను నమ్మట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఖననం చేసిన ప్రదేశాల్ని చూపించడానికి వచ్చాను. సంవత్సరాలు గడిచిన కారణంగా మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుంది. గుర్తించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. అవశేషాల గుర్తించాలంటే జేసీబీ పనితీరులో వేగం పుంజుకోవాలి. స్పాట్ 13తో సహా ఇంకా నాలుగు నుండి ఐదు ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. సిట్ బృందం నాతో పాటు పనిచేసిన వారిని కూడా గుర్తించాలి.వాళ్లొస్తే.. మృతదేహాల గుర్తింపు సులభం అవుతుంది. వేగం అవుతుందన్నారు. సౌజన్య హత్య కేసుసిట్ బృందం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే 2012లో ధర్మస్థళ సమీప నిర్మానుష్య ప్రదేశంలో 17 ఏళ్ల సౌజన్య హత్య జరిగిన నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. సౌజన్య హత్యకు గురైన రాత్రి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాననేది అవతల వ్యక్తి ఆరా తీశాడు. నేను సెలవు తీసుకుని ఊరికి వచ్చానని చెప్పడంతో ఫోన్లోని అవతలి వ్యక్తి నాపై గట్టిగా అరిచాడు. మరుసటి రోజు, హత్యకు గురైన అమ్మాయి మృతదేహాన్ని నేను చూశాను’అని విచారం వ్యక్తం చేశారు. అస్థి పంజరాలు కల్లోకి వచ్చేవి ఓసారి నా కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికనుపై అధికారులు లైంగికంగా వేధించారు. దాంతో ధర్మస్థళ నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉండేది.కొన్నిసార్లు మృతదేహాల అస్థిపంజరాలు నాకు కల్లోకి వచ్చేవి.అందుకే బాధితులకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ముందుకు వచ్చాను. నా ఉద్దేశ్యం ఆలయాన్ని కించపరచడం కాదు, మృతదేహాలను గుర్తించడం.. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన .. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. మృతదేహాల నుంచి ఆభరణాలను దొంగిలించడమే కాదు.. ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నాంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని పారిశుధ్య కార్మికుడు ఖండించారు. నేను దొంగతనం చేసి బతకాలనిపిస్తే.. ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని. ఆలయంలో ఎందుకు విధులు నిర్వహించేవాడిని అని అన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు విషయానికొస్తే.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. వాటిలో 6,11స్పాట్లలో అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 13వ స్పాట్లో అత్యధిక మృతదేహాలు ఉన్నాయని భీమ పేర్కొన్నారు. అక్కడ తవ్వకాలు సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. ఇప్పటి వరకు భీమ 15 ప్రదేశాలను గుర్తించగా.. వాటిలో 8 నేత్రావతి నది ఒడ్డున, మిగిలినవి హైవే పక్కన ఉన్నాయి. -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్‌కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్‌ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్‌పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్‌తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్‌చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్‌కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్‌ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్‌ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్‌ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
అమానవీయం: గాజా ఆస్పత్రిలో 179 మంది సామూహిక ఖననం
గాజా: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో 179 మందిని సామూహికంగా ఖననం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహ్మద్ అబు సల్మియా.. మానవతా సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక సమాధి చేసినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఆస్పత్రికి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు మరణించారు. వారందర్నీ సామూహికంగా పూడ్చిపెట్టామని అధికారులు తెలిపారు. ఏడుగురు పిల్లల్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం బయటకు విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రి శవాల నిలయంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కుళ్లిన శవాల కంపుతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఆరోపించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఆస్పత్రిని చుట్టుముట్టింది. గత వారం 72 గంటల పాటు అల్ షిఫాకు కరెంట్, నీరు, ఆహారం సరఫరా కాకుండా నిలిపివేసింది. కాల్పులతో ఆస్పత్రి చుట్టూ భీకర వాతావరణం ఏర్పడటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తప్పని స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోనే ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇజ్రాయెల్ సేనలు సొరంగాలను కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. హమాస్ సొరంగాలకు కేంద్రంగా అల్ షిఫా ఆస్పత్రి ఉందని ఇజ్రాయెల్ దళాలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి కేంద్రంగా ఉగ్రవాదుల ఇళ్లకు సొరంగాలు ఉన్నాయని సైన్యం అంటోంది. ఇదీ చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
పారిస్‌లో సామూహిక సమాధులు
పర్యాటకుల కలల ప్రపంచమైనా పారిస్‌లో ఓ సూపర్ మార్కెట్‌ను పునరుద్ధరించేందుకు బేస్మెంట్ను తవ్వుతుండగా ఇటీవల సామూహిక సమాధులు బయటపడ్డాయి. 200 మానవ కళేబరాలు బయటపడ్డాయి. తల నుంచి కాళ్ల వరకు ఒకరి పక్కన ఒకరిని వరుసగా నిట్టనిలువుగా నిలబెట్టిన ఈ మృతదేహాల అవశేషాలు ఎనాటివో కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. వారు ఎలా చనిపోయారన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. అవి ఏనాటివో తెలిస్తే గానీ కారణాలను అంచనా వేయలేం. సూపర్ మార్కెట్ భవనం పునాదుల కింద ఏడు సామూహిక సమాధులు బయటపడ్డాయి. గదుల్లా ఉన్న ఈ సమాధుల్లో అతి పెద్ద దాంట్లో 150 మృతదేహాలు కళేబరాలు, మిగతావాటిలో 5 - 20 మృతదేహాలు బయటపడ్డాయి. ప్రస్తుతం సూపర్‌మార్కెట్ ఉన్న స్థలంలో ఒకప్పుడు ట్రినిటీ ఆస్పత్రి ఉండేది. 1202 లోనే పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లో ప్లేగులాంటి మహమ్మారీల వల్ల రోజుకు ఆస్పత్రిలో వంద మందికి పైగా మరిణించేవారట. అందుకని ఆస్పత్రి పక్కనే ఓ శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేశారట. కిక్కిరిసిన నగరంలో మృతదేహాలను ఖనననం చేయడానికి చోటు దొరక్క నగర ప్రజలు కూడా తమ వారిని ఈ శ్మశానంలోనే ఖననం చేశారట. అయితే ఇప్పుడు బయటపడిన మృతదేహాల అవశేషాలపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో దేహాలపై ఎలాంటి గాయాలు గానీ, జబ్బుపడిన లక్షణాలు గానీ కనిపించకపోవడం కొంత ఆశ్చర్యమేనని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. 'కార్బన్ రేడియో ఆక్టివ్ ఐసోటోప్స్'ను ఉపయోగించి ఆ మృతదేహాలు ఏకాలం నాటివో కనుక్కుంటామని వారు చెబుతున్నారు.