‘సిట్‌ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌ | Dharmasthala Mass Burial Case Latest Update | Sakshi
Sakshi News home page

‘సిట్‌ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

Aug 14 2025 7:45 PM | Updated on Aug 14 2025 8:24 PM

Dharmasthala Mass Burial Case Latest Update

బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు ఊహించని మలుపు తిరిగింది. పారిశుధ్య కార్మికుడిగా (విజిల్‌బ్లోయర్) విధులు నిర్వహించే సమయంలో ధర్మస్థళలో వందలాది శవాలను తాను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ (స్థానికులు పిలుస్తున్న పేరు) మీడియా ముందుకు వచ్చారు.

ధర్మస్థళలో అవశేషాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు  తనని నమ్మడం లేదని, నేను వారిని నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు తాను ఖననం చేసిన వారి అస్థిపంజరాలు తన కల్లోకి కూడా వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశారు.    

ధర్మస్థళ కేసు పురోగతిపై ఇండియా టుడే పారిశుధ్య కార్మికుడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను బహిర్ఘతం చేశారు.ధర్మస్థళలో 1995-2014 మధ్య కాలంలో నేను పారిశుధ్య కార్మికునిగా పని చేసే సమయంలో వందల మంది బాధితుల మృతదేహాల్ని ఖననం చేశాను. ఆ మృతదేహాలపై హింస,లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశా. మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ ప్రతినిధులు మాకు ఆ పని పురమాయించారు. మృతదేహాల ఖననం విషయంలో ప్రభుత్వం,గ్రామ పంచాయతీ పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పింది లేదు. ఎవరి మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో.. ఎక్కడ దహనం చేయాలో మొత్తం ఆలయ అధికారులే ఆదేశించారు.  

అడవులు,నదీ తీరంలో ఖననాలు
ధర్మస్థళ దేవాలయం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేం మృతదేహాలను ఖననం చేసే వాళ్లం.పూడ్చి పెట్టేవాళ్లం.ఈ పనిలో నాతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు.మహిళల మృతదేహాలను స్మశాన వాటికల్లో కాకుండా అడవుల్లో,పాతబడిన రోడ్లు,నదీ సమీపంలో పాతిపెట్టేవాళ్ళం.మేము బాహుబలి కొండలపై ఒక మహిళను,నేత్రావతి స్నాన ఘాట్‌లో దాదాపు 70 మృతదేహాలను ఖననం చేశాం. నేను చెప్పిన స్పాట్‌ నెంబర్‌ 13లో సుమారు 70 నుండి 80 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను ఖననం చేసే సమయంలో స్థానికులు మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్లెప్పుడూ జోక్యం చేసుకోలేదు.పై నుంచి ఆదేశాలు వచ్చేవి. మృతదేహాలను ఖననం చేసేవాళ్లం. అదే మా పని.

ధర్మస్థల ఆలయం నుండి కిలోమీటర్‌ దూరంలో ఓ కొండపైన దిగంబర్ జైన విగ్రహం ఉంది. దానిని బాహుబలికొండ అని పిలుస్తారు. దిగంబర్‌ జైన్ విగ్రహం చేరుకోవాలంటే కింది నుంచి 300మెట్లు ఎక్కాల్సి ఉంది.

100 మృతదేహాలలో 90 వారివే
ఖననం లేదంటే దహనం చేసిన మహిళలు,యువతులు,బాలికల మరణానికి కారణాలేంటనేది చెప్పలేదు. అయితే ఆ మృతదేహాలపై హింస, లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కొన్ని మృతదేహాలపై స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వారిపై దాడి జరిగినట్లు అనిపించింది. బాధితులపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది వైద్యలు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాల్లో పిల్లలు,వృద్ధుల ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఉండగా.. ఖననం చేసినట్లు పేర్కొన్న 100 మృతదేహాలలో 90 మంది వారే ఉండటం గమనార్హం.

మారిన స్థలాలు..ఆధారాలు మాయం 
ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో నాడు ఖననం చేసిన ప్రాంతాల వరకు ఆచూకీ కనిపించడం లేదు. 1995-2014 మధ్య కాలంలో మృతదేహాలను ఖననం చేసే సమయంలో ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేవి. ఇప్పుడు ఎటుచూసినా చెట్లు మొలిచాయి. నిర్మాణాలు ఏర్పడ్డాయి.అయినప్పటికీ వాటిల్లో ఓ పాత రహదారి ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. కాకపోతే ఆ ప్రాంతం అంతా అడవిలా మారింది. ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలు గుర్తించాను. జేసీబీ సాయంతో మరిన్ని మృతదేహాలను గుర్తిస్తానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.

మీరు వందల మందిని ఖననం చేశామని చెబుతున్నారు సరే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ బృందం 13 ప్రదేశాల్లో పాక్షికంగా మృతదేహాల అవశేషాలను గుర్తించింది. వారిలో ఒక పురుషుడు మాత్రమేనని తెలుస్తోంది.మరి మిగిలిన మృతదేహాల మాటేమిటీ అని ప్రశ్నిస్తే.. బాధితుల్ని ఖననం చేసింది మేమే.. నేను నిజమే చెబుతున్నాను అని తనని తాను సమర్ధించుకున్నారు.

‘నేను సిట్‌ను నమ్ముతాను..సిట్ నన్ను నమ్మదు’
ఈ సందర్భంగా సిట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారిలో సిట్‌ బృందానికి ఐపీఎస్‌ డాక్టర్‌ ప్రణవ్‌ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఐపీఎస్ అధికారాలు అనుచేత్,జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికంలు ఉన్నారు. వీరితో పాటు వైద్య పరీక్షల కోసం మంగళూరు కేఎంసీ వైద్యులు,అవశేషాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఉన్నారు.

 ఇప్పుడు అదే సిట్‌ను మాజీ పారిశుధ్యకార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్‌ బృందాన్ని తాను నమ్ముతున్నట్లు.. వారి విధానంపై నిరాశను వ్యక్తం చేస్తూ.. నేను సిట్‌ను నమ్ముతాను. వాళ్లు నన్ను నమ్మట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఖననం చేసిన ప్రదేశాల్ని చూపించడానికి వచ్చాను. సంవత్సరాలు గడిచిన కారణంగా మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుంది. గుర్తించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. అవశేషాల గుర్తించాలంటే జేసీబీ పనితీరులో వేగం పుంజుకోవాలి. స్పాట్ 13తో సహా ఇంకా నాలుగు నుండి ఐదు ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. సిట్ బృందం నాతో పాటు పనిచేసిన వారిని కూడా గుర్తించాలి.వాళ్లొస్తే.. మృతదేహాల గుర్తింపు సులభం అవుతుంది. వేగం అవుతుందన్నారు.  

సౌజన్య హత్య కేసు
సిట్‌ బృందం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే 2012లో ధర్మస్థళ సమీప నిర్మానుష్య ప్రదేశంలో 17 ఏళ్ల సౌజన్య హత్య జరిగిన నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. సౌజన్య హత్యకు గురైన రాత్రి నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాననేది అవతల వ్యక్తి ఆరా తీశాడు. నేను సెలవు తీసుకుని ఊరికి వచ్చానని చెప్పడంతో ఫోన్‌లోని అవతలి వ్యక్తి నాపై గట్టిగా అరిచాడు. మరుసటి రోజు, హత్యకు గురైన అమ్మాయి మృతదేహాన్ని నేను చూశాను’అని విచారం వ్యక్తం చేశారు.  

అస్థి పంజరాలు కల్లోకి వచ్చేవి 
ఓసారి నా కుటుంబానికి చెందిన ఓ మైనర్‌ బాలికనుపై అధికారులు లైంగికంగా వేధించారు. దాంతో ధర్మస్థళ నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉండేది.కొన్నిసార్లు మృతదేహాల అస్థిపంజరాలు నాకు కల్లోకి వచ్చేవి.అందుకే బాధితులకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ముందుకు వచ్చాను. నా ఉద్దేశ్యం ఆలయాన్ని కించపరచడం కాదు, మృతదేహాలను గుర్తించడం.. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన .. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. మృతదేహాల నుంచి ఆభరణాలను దొంగిలించడమే కాదు.. ఆలయాన్ని కించపరచడానికి  ప్రయత్నం చేస్తున్నాంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని పారిశుధ్య కార్మికుడు ఖండించారు. నేను దొంగతనం చేసి బతకాలనిపిస్తే.. ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని. ఆలయంలో ఎందుకు విధులు నిర్వహించేవాడిని అని అన్నారు.  

ప్రస్తుతం కేసు దర్యాప్తు విషయానికొస్తే.. 
కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. వాటిలో 6,11స్పాట్‌లలో అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 13వ స్పాట్‌లో అత్యధిక మృతదేహాలు ఉన్నాయని భీమ పేర్కొన్నారు. అక్కడ తవ్వకాలు సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. ఇప్పటి వరకు భీమ 15 ప్రదేశాలను  గుర్తించగా.. వాటిలో 8 నేత్రావతి నది ఒడ్డున, మిగిలినవి హైవే పక్కన ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement