
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో.. తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ధరస్థళ తవ్వకాల వ్యవహారం.. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ క్రమంలో.. ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. డీఎకేఎస్ కామెంట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది.
ధర్మస్థళ తవ్వకాలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది. దివారం సుమారు 20 మంది చట్టసభ్యులు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రతో కలిసి ధర్మస్థళ పెద్దలను కలిశారు. వాళ్లు కలిసిన వాళ్లలో ఆలయ ధర్మకర్త, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక పట్టణం విషయంలో జరుగుతున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నిజమైన మంజునాథుడి భక్తుడే అయితే.. జరిగిన ఆ కుట్ర ఏంటో, దానివెనక ఎవరున్నారో బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.

అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన సిట్ తవ్వకాలపై మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరో.. ఏదో చెప్పారని.. ప్రభుత్వం తవ్వకాలు చేయించడం ఏంటి?. పోనీ ఇప్పటిదాకా జరిగిన తవ్వకాల్లో ఏమైనా బయటపడ్డాయా? అంటే అదీ లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి.. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. నిజాలు.. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో.. శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలకు దిగారు.
వామపక్ష భావజాలం ఉన్న ఓ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్.. ధర్మస్థళపై తప్పుడు ప్రచారానికి దిగింది. హిందువులకు, ధర్మస్థళకు వ్యతిరేకంగా విషప్రచారం చేస్తోంది. ఆ దండుపాళ్య ముఠా చేసిన ప్రచారానికి ప్రభుత్వం తలొగ్గింది. దీనంతటికి సీఎం సిద్ధరామయ్యే కారణం. ఆయన అధికారంలోకి రాకముందు.. వాళ్లంతా అడవుల్లో తిండి కోసం కష్టాలు పడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ధర్మస్థళ ఆలయంపైకే జేసీబీలను నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సౌజన్య కేసులోనో.. సిట్ దర్యాప్తునకో మేం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏవరో ఏదో చెప్పారని సీఎం సిట్‌ను ఏర్పాటు చేయించడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఇధి ధర్మస్థళ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యనే. అందుకే దానినే మేం వ్యతిరేకిస్తున్నాం అని అన్నారాయన.

ఇదిలా ఉంటే.. ధర్మస్థళ వ్యవహారంలో సిట్ మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ సిట్‌కే ఉందని తేల్చి చెప్పారు. ‘‘ఈ వ్యవహారంలో మధ్యంతర, తుది నివేదిక ఇవ్వడమనేది సిట్ చేతుల్లోనే ఉంది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’’ అని అన్నారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీలో తవ్వకాల వ్యవహారంపై ప్రకటన చేయబోతున్నారు.
1995-2014 మధ్య వందలాది హత్యలు జరిగాయని, వాటి మృతదేహాలను తానే ఖననం చేశానంటూ గతంలో ధర్మస్థళ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఓ వ్యక్తి(61) ఆరోపణలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పెద్దల ఆదేశాల మేరకు తాను ఆ పని చేశానంటూ చెప్పుకొస్తున్నాడా వ్యక్తి.

ఈ క్రమంలో.. 2022లో ట్రిప్ కోసం ధర్మస్థళకు వెళ్లిన తన 22 ఏళ్ల కూతురు తిరిగి రాలేదంటూ బెంగళూరుకు చెందిన సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేగు(విజిల్ బ్లోయర్ ) ఆరోపణలు, సుజాత ఫిర్యాదు నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఆ వ్యక్తి తొలుత చూపించినట్లు 13 చోట్ల మాత్రమే కాకుండా.. ఆపై గుర్తించిన మరో నాలుగు చోట్ల కూడా సిట్ తవ్వకాలు జరిపించింది. అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాల అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది.

అయితే పశ్చిమ కనుమల్లో పుట్టిన నేత్రావతి నదీ.. గత దశాబ్దంన్నరకాలంగా తీవ్ర వరదలతో ప్రభావితం అయ్యింది. దీంతో తీర ప్రాంతం కోతకు గురై సమూలంగా మారిపోయిందని, బహుశా ఆ అవశేషాలు కొట్టుకుపోయి ఉంటాయని చెబుతున్నాడతను. మరోవైపు.. సుజాత తన కూతురు అనన్య ఫొటోను తొలిసారిగా మీడియాకు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు మిస్టరీ ఎలా ముగుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.