అమానవీయం: గాజా ఆస్పత్రిలో 179 మంది సామూహిక ఖననం

Horror At Gaza Hospital 179 In Mass Grave - Sakshi

గాజా: ఇజ్రాయెల్ సేనల దాటికి గాజా విలవిల్లాడుతోంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం జరుపుతున్న దాడుల్లో ఎన్నో అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్‌ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో 179 మందిని సామూహికంగా ఖననం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహ్మద్ అబు సల్మియా.. మానవతా సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక సమాధి చేసినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. 

ఆస్పత్రికి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు మరణించారు. వారందర్నీ సామూహికంగా పూడ్చిపెట్టామని అధికారులు తెలిపారు. ఏడుగురు పిల్లల‍్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం బయటకు విడుదల చేసింది. అల్‌ షిఫా ఆస్పత్రి శవాల నిలయంగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కుళ్లిన శవాల కంపుతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గాజాలో అతిపెద్దదిగా పేరుగాంచిన అల్‌ షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారని ఆరోపించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. ఆస్పత్రిని చుట్టుముట్టింది. గత వారం 72 గంటల పాటు అల్‌ షిఫాకు కరెంట్, నీరు, ఆహారం సరఫరా కాకుండా నిలిపివేసింది. కాల్పులతో ఆస్పత్రి చుట్టూ భీకర వాతావరణం ఏర్పడటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తప్పని స్థితిలో ఆస్పత్రి ప్రాంగణంలోనే ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. 

హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి ఇజ్రాయెల్ సేనలు సొరంగాలను కేంద్రంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. హమాస్ సొరంగాలకు కేంద్రంగా అల్‌ షిఫా ఆస్పత్రి ఉందని ఇజ్రాయెల్ దళాలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి కేంద్రంగా ఉగ్రవాదుల ఇళ్లకు సొరంగాలు ఉన్నాయని సైన్యం అంటోంది. 

ఇదీ చదవండి: హమాస్‌ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top