ఇజ్రాయెల్‌ భీకర దాడులు  | Israeli air strikes kill at least 31 Palestinians in Gaza | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ భీకర దాడులు 

Feb 1 2026 3:32 AM | Updated on Feb 1 2026 3:32 AM

Israeli air strikes kill at least 31 Palestinians in Gaza

గాజాలో ఆరుగురు చిన్నారులు సహా 31 మంది మృతి 

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక అత్యధిక మరణాలు

దెయిర్‌ అల్‌–బలాహ్‌: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ భారీ వైమానికదాడులకు దిగింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం వేర్వేరు ప్రాంతాలపై జరిగిన దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 31 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్‌ 10వ తేదీ నుంచి అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. 

హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ శుక్రవారం ఆరోపణలు చేసిన ఇజ్రాయెల్‌..కొద్ది గంటల్లోనే గాజా సిటీలోని అపార్టుమెంట్‌ భవనం, పోలీస్‌స్టేషన్‌లతోపాటు ఖాన్‌యూనిస్‌లోని శరణార్థుల టెంట్‌పై ప్రధానంగా దాడులు జరిపింది. పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 14 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. 

టెంట్‌పై జరిగిన దాడిలో మంటలు చెలరేగి ఒక తండ్రి, అతడి ముగ్గురు పిల్లలు, మరో ముగ్గురు మనవలు మృతి చెందారు. గాజా సిటీలోని అపార్టుమెంట్‌ భవనంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గాజా సిటీలోని పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో నలుగురు మహిళా పోలీసులు సహా 14 మంది మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వివరించాయి. 

జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో ఒకరు చనిపోయినట్లు నాస్సెర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ చర్యలను హమాస్‌ తీవ్రంగా ఖండించింది. దాడులను ఆపేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తేవాలని అమెరికాను, ఇతర దేశాలను కోరింది. అయితే, ఒప్పందంలోని షరతులను హమాస్‌ ఉల్లంఘిస్తున్నందునే దాడులకు దిగాల్సి వచ్చిందని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. తమ దాడుల్లో రఫాలోని ఓ టన్నెల్‌ నుంచి బయటకు వస్తున్న ముగ్గురు సాయుధులు మరణించారని ప్రకటించింది. 

కాగా, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో శుక్రవారం వరకు కనీసం 520 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఇలా ఉండగా, గాజా వాసులకు జీవనాధారమైన ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా క్రాసింగ్‌ను పాదచారుల కోసం ఆదివారం తెరుస్తామంటూ ఇజ్రాయెల్‌ శుక్రవారం ప్రకటన చేయడం తెల్సిందే. దీంతో, కాల్పుల విరమణ ఒప్పందం అమలు రెండో దశ ప్రారంభమైందని భావిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులకు తెగబడటం ఆందోళన కలిగించే పరిణామమని పరిశీలకులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement