
మాజీ పారిశుద్ధ్యకార్మీకుని సంచలన ఆరోపణ
ధర్మస్థల వివాదంలో కొత్త అంశాలు వెలుగులోకి
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత వివాదాస్పదంగా మారిన మృతదేహాల పూడ్చివేత ఉదంతంలో ధర్మస్థల ఆలయ నిర్వాహకులే గుర్తుతెలియని మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని తనను ఆదేశించారని మాజీ పారిశుద్ధ్యకార్మీకుడు భీమ తాజాగా ప్రకటించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భీమ ఇలాంటి సంచలన విషయాలను తొలిసారిగా పంచుకున్నారు.
‘‘నేను, నాతోపాటు మరికొందరం కలిసి డజన్ల కొద్దీ మృతదేహాలను 1995 నుంచి 2014కాలంలో అటవీ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పూడ్చిపెట్టాం. మృతుల్లో చాలావరకు మహిళలు, చిన్నారులే. ఆనాడు పారిశుద్ధ్యకార్మీకునిగా పనిచేశా. అయితే మృతదేహాలను పూడ్చిపెట్టాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచిగానీ గ్రామపంచాయితీ అధికారులుగానీ ఆదేశించలేదు. కేవలం ధర్మస్థల ఆలయ సమాచార కేంద్రం నిర్వాహకులు, అధికారులే మాకు ఈ ఆదేశాలిచ్చారు.
మేం ఏ ఒక్క మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననంచేయలేదు. అన్నింటినీ అడవిలోనే పాతిపెట్టాం. పాత రోడ్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం. బాహుబలి కొండల్లో ఒక మహిళను పూడ్చిపెట్టాం. నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఏకంగా 70 మృతదేహాలను పాతిపెట్టాం. ఇప్పటికే అధికారులు తవ్వకాలు జరిపిన 13వ చోట అయితే నాకు గుర్తుండి దాదాపు 70, 80 మృతదేహాలను పూడ్చిపెట్టాం. కొన్ని సార్లు పూడ్చేటప్పుడు స్థానికులు మమ్మల్ని గమనించారు. కానీ ఎవరూ మాకు అడ్డుచెప్పలేదు’అని ప్రజావేగుగా మారిన భీమ చెప్పారు.
లైంగిక వేధింపుల గుర్తులు
‘‘మృతదేహాలను చూస్తే హింసకు, లైంగిక వేధింపులకు గురైనట్లు స్పష్టంగా తెలిసేది. మృతదేహాలపై గాయాలైన గుర్తులుండేవి. హింసించి చంపేశారని అర్థమయ్యేది. కానీ వాస్తవంగా లైంగిక వేధింపులు జరిగాయో లేదో వైద్యనిపుణులే చెప్పగలరు’’అని భీమ అన్నారు. ‘‘చిన్నారుల మొదలు వృద్దుల దాకా అన్ని వయసుల వాళ్ల మృతదేహాలను మేం పూడ్చిపెట్టాం.
వంద మృతదేహాల్లో దాదాపు 90 దాకా మహిళలవే. అడవిలో వర్షాల కారణంగా నేల కోతకు గురవ్వడం, అటవీ ప్రాంతందాకా నివాసభవన నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు కొన్ని పూడ్చిన స్థలాలను గుర్తుపట్టడం కష్టమే. గతంలో నేను గుర్తుపట్టడానికి అక్కడో రోడ్డు ఉండేది. జేసీబీ తవ్వకాలతో ఇప్పుడా రహదారి మార్గం గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. గతంలో కొన్ని చోట్ల చెట్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు బాగా చెట్లు పెరిగి ఆ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది’’అని అన్నారు.
నేను సిట్‌ను నమ్మినా వాళ్లు నన్ను నమ్మట్లేరు
‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను నేను పూర్తిగా నమ్ముతున్నా. కానీ సిట్ అధికారులు నేను చెప్పేది విశ్వసించట్లేరు. వాళ్ల దర్యాప్తు ధోరణి చూస్తుంటే నాకు విసుగొస్తోంది. నాకు గుర్తున్నమేరకు ఆయా చోట్లను చూపిస్తున్నా. సిట్ అధికారులు పైపైన తవ్వేసి ఏమీ దొరకట్లేదని నాపై నమ్మకం పోగొట్టుకుంటున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన ఆయా ప్రాంతాల్లో మరింత విస్తృతస్థాయిలో తవ్వకాలు జరిపితే ఆధారాలు లభిస్తాయి.
13వ నంబర్ స్పాట్‌సహా కనీసం మరో నాలుగైదు చోట్ల తవ్వాల్సిందే. నాతోపాటు మృతదేహాలు పూడ్చినవాళ్లను సిట్ రప్పిస్తే ఈ వెతుకులాట సులభమవుతుంది. పశ్చాత్తాపంతోనే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ధర్మస్థలకు వచ్చి పచ్చి నిజాలు బయటపెట్టా. కలలో ఎప్పుడూ అస్తిపంజరాలే కనిపించేవి. అనామకులను పూడ్చిపెట్టానన్న పాపభీతి నన్ను వెంటాడింది. ఆ భయం, భారం తగ్గించుకునేందుకు మీడియా ముందుకొచ్చి జరిగిందంతా చెబుతున్నా.
పూడ్చిన కళేబరాలకు ఇకనైనా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అంతిమసంస్కారాలు జరగాలని ఆశిస్తున్నా. ధర్మస్థల ఆలయ పరువును మంటగలపడం నా ఉద్దేశం కానేకాదు. నేనెక్కిడికీ పారిపోవాల్సిన అవసరం లేదు. పూడ్చిన ప్రాంతాల గుర్తింపునకు సాయపడతా. తర్వాత నా స్వస్థలానికి వెళ్లిపోతా. మృతదేహాలపై ఉండే బంగారు ఆభరణాలను నేను దొంగతనం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదు. బంగారమే దోచేస్తే ఇన్నాళ్లూ పారిశుద్ధ్యకార్మీకునిగా బతుకీడ్చాలిన అగత్యమెందుకు?. నేను అలాంటి తప్పుడు పనులు చేయను. నేను హిందువును. అందులోనూ షెడ్యూల్డ్ కులస్తుడను’’అని భీమ అన్నారు.
70 శవాలను నేనే పూడ్చా
‘‘దాదాపు 70, 80 మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టా. కొన్నింటిని నేలలో చాలా లోతులో పూడ్చిపెట్టాం. మరికొన్నింటిని కొండల మీద పాతిపెట్టాం. ఆలయ ఇన్ఫర్మేషన్ సెంటర్ యాజమాన్యం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే శవాలను పూడ్చిపెట్టాం. ఆలయ మేనేజర్ ఎప్పుడూ నన్ను నేరుగా కలవలేదు. రూమ్ బాయ్ ద్వారా మాకు ఆదేశాలు అందేవి. వాటిని మేం అమలుచేసేవాళ్లం. మేం పూడ్చిన ప్రాంతాల్లోనే భవన నిర్మాణాలు జరిగాయి. అందుకే సిట్ తవ్వకాలు జరిపిన చోట్ల మృతదేహాల ఆనవాళ్లు లభించట్లేదేమో. పట్టపగలే మేం మృతదేహాలను పూడ్చాం’’అని భీమ చెప్పారు.