
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్‌లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా.
ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్‌లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం.

ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్‌లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే..

ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్‌చుప్!
జనాలు రాకుండా..
గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు.
గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే..

ఏంటీ మిస్టరీ కేసు..
దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్‌కు ఇటీవల ఒక లేఖ రాశాడు.
ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’

2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు.
మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
వందల మంది మిస్సింగ్?
దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి.

గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్‌ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!
మీడియాకు ఊరట
ధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్‌ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్‌ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది.

