
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళలో ఉన్న శ్రీ మంజునాథ దేవాలయం, నేత్రావతి నదీ తీరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మృతదేహాలను 20 ఏళ్ల పాటు సమీప అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టానంటూ ఆ దేవాలయంలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ధర్మశాలలో తప్పిపోయిన కోల్‌కతాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆమె తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడలోని బెత్తంగడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో ధర్మస్థళ హత్యాకాండపై సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై స్పందించిన కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి.. రెండు దశాబ్ధాల కాలంలో ధర్మస్థళలో అదృశ్యమైన మహిళలు, బాలికల కేసులు, అసహజ మరణాలు, హత్యలు, లైంగిక దాడులపై పునర్విచారణ జరపాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.
ఈ ఒత్తిళ్లతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఇంటర్నల్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ జనరల్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహించేలా ఆదేశాలు ఇచ్చింది. వివిధ విభాగాలకు చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారులనూ సిట్‌లో నియమించింది.
ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ డి. దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.
వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్‌లో ‘ఎక్స్’, ఫేస్‌బుక్ పోస్టులు, థ్రెడ్‌లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌లో గ్యాగ్ ఆర్డర్‌తో పాటు జాన్ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్‌లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్‌బుక్ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లు, 108 న్యూస్ లింక్‌లు, 37 రెడ్డిట్ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్‌లో పొందుపరిచారు.
వీటిలో ’లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్’ ఎపిసోడ్లు, ది న్యూస్ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్ ఐ, ధూత, సమీర్, ది న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్ కా18 తదతరాలను చేర్చారు.
గ్యాగ్ ఆర్డర్ కేవలం పిటిషన్‌లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్ డో ఆర్డర్ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పిటిషన్‌లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్ రాయ్ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్ పోర్టల్ థర్డ్ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
– శ్రీరంగం కామేష్