
ఢిల్లీ నుంచి తెచ్చిన ముసుగు మనిషి
ఓ ముఠా అప్పగించింది
సిట్ విచారణలో చిన్నయ్య వెల్లడి?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది.
పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్‌లో మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్‌లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.
సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ!
కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్‌ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది.
గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్‌లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.
యూట్యూబర్ సమీర్ విచారణ
శివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.