
విజయవాడ కోర్టు వద్ద వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మద్యం అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై డిఫెన్స్ వాదనలు
తప్పుడు వాంగ్మూలాలతో అడ్డగోలు కేసులు
గన్‌మెన్ గిరిబాబు సాక్ష్యం ఆధారంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు
సిట్ విచారణ మర్నాడే గిరిబాబుకు భారీ వేతన పెంపుతో ఆక్టోపస్‌లోకి ప్రమోషన్
కేసులకు సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా చేసుకోవడం దారుణం
కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసి చార్జ్‌షీట్లు దాఖల
వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి
బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించిన న్యాయవాదులు
యథావిధిగా కౌంటర్, రిమాండ్ రిపోర్టులు సుదీర్ఘంగా చదవడం మొదలుపెట్టిన సిద్ధార్థ లూథ్రా
డిఫెన్స్ న్యాయవాదుల తీవ్ర అభ్యంతరం
కోర్టు విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం
వాదనలు ముగియడంతో 24వ తేదీకి తీర్పు రిజర్వ్
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో ఏ తప్పూ చేయకుండా నిందితులు సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గుతున్నారని డిఫెన్స్ న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యిందని, ఇందుకు అనుగుణంగా చార్జ్‌షీట్లు కూడా దాఖలయ్యాయని పేర్కొంటూ రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. నిందితులకు బెయిల్ మంజూరుచేస్తే, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎటువంటి షరతులకైనా సిద్ధమని కోర్టుకు విన్నవించారు.
ఈ కేసులో జైలులో ఉన్న రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్‌నాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణల బెయిల్ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రగిరి విష్ణువర్థన్, నాగేంద్రరెడ్డి, ఎం వాణి, నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆన్‌లైన్‌లో హాజరై వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిన సిట్: పొన్నవోలు
రాజ్ కేసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘కేసుకు సంబంధించి నిందితులపై సిట్ విచారణ పూర్తిచేసి, చార్జ్‌షీటు కూడా దాఖలుచేసింది. ఈ కేసులో 409 మంది సాక్షులను విచారించింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీలో రాజ్ కేసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో సిట్ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. సిట్ అధికారులు సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని ముద్దాయిగా నిర్ధారిస్తూ రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొనడం తగదు. వాస్తవానికి ఒక్కో టవర్ లొకేషన్ 3 నుండి 5 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది.
ఆ పరిధిలో ఎంతో మంది సెల్‌ఫోన్‌లు వాడతారు. అంతమాత్రాన ఈ కేసుతో వారందరికీ నిందితులతో సంబంధం ఉందని ఎలా నిర్ధారిస్తారు? సిట్ అధికారులు నిందితుడి కార్యాలయం కూడా జూబ్లిహిల్స్ పరిధిలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి లొకేషన్ కూడా అదే పరిధిలో ఉంది. అంతమాత్రాన ఆయనకు కేసుతో సంబంధం ఉందని భావించాలా?. రాజ్ కేసిరెడ్డిని కావాలనే 188 రోజులుగా జైలులో ఉంచారు. అరవింద్ కేజ్రివాల్ వర్సెస్ సీబీఐ, కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుగుణంగా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాను’ అని అన్నారు.
24వరకు రిమాండ్ పొడిగింపు
రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు ,చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు ఈనెల 24వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరిచారు.
సాగదీత ధోరణి మార్చుకోని లూథ్రా
ప్రాసిక్యూషన్ తరఫున తొలుత వాదనలను వినిపించిన లూథ్రా గురువారం తరహాలోనే కేసు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు సుదీర్ఘంగా చదువుతూ, ‘అదే వాదన’ అన్న ధోరణిని ప్రదర్శించారు. ఈ సందర్భంలో డిఫెన్స్ తరపున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంటలు గంటలు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు చదువుతూ పోతే వాదనలు ఎప్పుడు వినిపిస్తారని ప్రశ్నించారు. కోర్టు విలువైన సమయాన్ని లూథ్రా వృథా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డి అమెరికా వెళ్లేందుకు అనుమతి
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఈ నెల 27 నుంచి 31 వరకు న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 నుంచి నవంబరు 4వ తేదీ వరకు ఆయనకు అనుమతి మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి. భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 50వేలు చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆమెరికా పర్యటన ముగించుకొని తిరిగి రాగానే పాస్ పోర్టు తిరిగి కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చెవిరెడ్డిపై కేసు అంతా కుట్ర కోణమే: న్యాయవాది వాణిరెడ్డి
చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరపు న్యాయవాది వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ...ఆయన ప్రజలలో నుండి వచ్చారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
వాదనల్లో మరికొన్ని అంశాలు..
» గన్‌మెన్ గిరిబాబు సాక్ష్యం ఆధారంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఈ అక్రమ కేసు నమోదుచేశారు.
» సిట్ అధికారులు గిరిబాబును 2025 జూన్ 1న విచారణ జరిపారు.
» ఆ మర్నాడు జూన్ 2న అతనికి ప్రమోషన్ కల్పించి భారీ వేతనం పెంపుతో ఆక్టోపస్‌లోకి తీసుకున్నారు.
» కేసు వెనుక ప్రలోభాల పర్వం ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క విషయం అద్దం పడుతోంది.
» బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణ ఇరువురు చిరు ఉద్యోగులు.
» వారిని కూడా సంబంధం లేని మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారు.
» నిందితులకు సంబంధించిన పాస్‌పోర్టులను సీజ్‌చేశారు.
» లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీచేశారు.
» ఇటువంటి పరిస్థితులలో నిందితులు ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదు.
» రాజ్యాంగంలోని 21వ అధికరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాము.