
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన.
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.
ఇదిలా ఉంటే.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది.
