
బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అంశాలను సుదీర్ఘంగా చదువుతూ కాలయాపనపై ఏసీబీ కోర్టు అసహనం
విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీం సైతం ఆదేశించింది
సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశం
అయినా మార్చుకోని లూథ్రా.. మరింత అసహనానికి గురైన జడ్జి
అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా.. లేదా?.. తీవ్ర స్వరంతో ప్రశ్నించిన న్యాయమూర్తి.. అయినా పట్టించుకోని లూథ్రా
చివరకు విచారణ వాయిదా కోరిన వైనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లీగల్ : మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తీరుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్‌కృష్ణల బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించడంలో లూథ్రా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తుండటాన్ని తప్పుబట్టింది. ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సిద్దార్ధ లూథ్రా గురువారం ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించారు.
అయితే తన వాదనలు సూటిగా వినిపించకుండా కాలయాపన చేసేందుకు యత్నించారు. కౌంటర్‌లోని అంశాలను చదువుకుంటూ ఆయన ఆలస్యం చేస్తుండటంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించినప్పటికీ సిద్దార్థ లూథ్రా తన సాగదీత వైఖరిని కొనసాగించడం గమనార్హం. దాంతో మరింత అసహనానికి గురైన న్యాయమూర్తి.. అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా.. లేదా? సూటిగా చెప్పాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
అయినా సరే లూథ్రా ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. శుక్రవారం వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని పదేపదే కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇప్పటికే రిమాండ్ మూడుసార్లు పొడిగించామని గుర్తు చేశారు. కొత్త ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు సమరి్పంచలేదని, ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.
డిఫెన్స్ న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో డిఫెన్స్ న్యాయవాదులు స్పందిస్తూ.. గతంలో చంద్రబాబుపై దాఖలైన కేసులో లూథ్రా అర్థరాత్రి వరకు వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాదనలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
మిధున్‌రెడ్డి అమెరికా వెళ్లే పిటిషన్‌పై విచారణ పూర్తి
ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు వెళ్లేందుకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అనుమతి ఇప్పించాల్సిందిగా ఎంపీ తరఫున న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఏసీబీ న్యాయస్థానంలో ఇరుపక్షాల తరఫున విచారణ పూర్తయింది. న్యాయమూర్తి పి.భాస్కరరావు తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.
చెవిరెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నెపూస వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది ఎం.వాణిరెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
మెరిట్ ఆధారంగా విచారణ జరపండి
మద్యం విధానంపై అక్రమ
కేసులో బెయిల్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానంపై అక్రమ కేసులో కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య బెయిల్ పిటిషన్ల విచారణకు మార్గం సుగమమైంది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బెయిల్ పిటిషన్లను కేసు మెరిట్ ఆధారంగా విచారించాలని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేసులో బుధవారం ఇచ్చిన తీర్పునే ఈ కేసులకు కూడా వర్తింపజేస్తున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

అందరికీ ఒకే తీర్పు వర్తింపు
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు విచారించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు ప్రతి బెయిల్ పిటిషన్‌ను మెరిట్ ఆధారంగా, స్వేచ్ఛగా విచారించి నిర్ణయం తీసుకోనుంది.
వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం..
మద్యం విధానంపై దాఖలైన కేసుల్లో కొందరు నిందితుల బెయిల్‌పై నిర్ణయం వెలువడే వరకు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో విచారించవద్దని హైకోర్టు ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టింది. ఒకరి బెయిల్ పిటిషన్‌తో మరొకరికి సంబంధం లేదని, ప్రతి కేసును దాని యోగ్యత (మెరిట్) ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల విచారణను నిలిపివేయడం సరికాదని, వ్యక్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.