మద్యం డాన్‌.. మరో డ్రామా! | Chandrababu Naidu Sarkar new drama every day in the liquor illegality case | Sakshi
Sakshi News home page

మద్యం డాన్‌.. మరో డ్రామా!

Sep 20 2025 5:36 AM | Updated on Sep 20 2025 5:36 AM

Chandrababu Naidu Sarkar new drama every day in the liquor illegality case

మద్యం అక్రమ కేసులో బాబు సర్కారు రోజుకో కొత్త నాటకం

వైఎస్‌ అనిల్‌రెడ్డి కార్యాలయాల్లో సిట్‌ సోదాలు.. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం 

కొత్త పాత్రలను తెరపైకి తెస్తూ దుష్ప్రచారం

రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని 

అసలు మద్యం డాన్‌ చంద్రబాబే 

బాబుపై ఇప్పటికీ మద్యం కేసులు ఉన్నాయి 

వాటి సంగతి ఏమయ్యింది? 

2014–19 టీడీపీ హయాంలో యథేచ్ఛగా దోపిడీ 

ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ 

చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్‌ పైనే ఉన్న చంద్రబాబు 

వాటిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు కొత్త డ్రామా  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించి వ్యవహరిస్తోంది. టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన సిట్‌తో ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసింది. రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమో­దు చేశారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. 

ఈ క్రమంలో చంద్రబాబు డైరెక్షన్‌లో సిట్‌ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. మొదట రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దు్రష్పచారం చేశారు. టీడీపీ అనుకూల మీడి­యా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పు­దారి పట్టిస్తున్నారు. 

అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు... ఈ రెడ్‌బుక్‌ కుట్ర కేసులో రెండో అంకంగా.... నర్రెడ్డి సునీల్‌రెడ్డి నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి పేర్లను తెరపైకి తెచ్చా­రు. తాజాగా వైఎస్‌ జగన్‌ సమీప బంధువు వైఎస్‌ అనిల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్‌ అధికారులు శుక్రవారం సోదాలకు దిగారు. 

చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్‌ అనిల్‌రెడ్డి ఏనాడూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లోగానీ ఇతర అంశాల్లో గానీ ఆయన ఏనాడూ కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్‌ అనిల్‌రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనని సిట్‌ను ఆదేశించింది. ఇదే అదనుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్‌ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యం. రానున్న రోజుల్లో సిట్‌ ద్వారా రెడ్‌బుక్‌ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది.

మద్యం కుట్రదారు చంద్రబాబే..
ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్న బాబు 
చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి ఈ కుట్రకు ఎందుకు పాల్పడుతోంది అంటే... అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి పాల్పడింది టీడీపీ ప్రభుత్వమే అన్నది వాస్తవం. రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. 2014–19లో టీడీపీ హయాంలో  తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. 4,834 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టారు. 

మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును అడ్డగోలుగా తొలగించారు. అందుకోసం ముఖ్య­మంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో దోపిడీకి తెరతీశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండి కొట్టారు. దీనిపై రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సి­పల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. 

ఇక ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు బృందం బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి సీఎం చంద్రబాబు తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్‌ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.

రాజ్‌ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్ర
రెడ్‌బుక్‌ కుట్ర కేసు కోసం చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. ఈ కేసుకు కేంద్ర బిందువుగా రాజ్‌ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కూటమి సర్కారు కుతంత్రం దాగుంది. ఆయన చెప్పని విషయాలను సైతం చెప్పినట్టుగా సిట్‌ తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అసలు ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్‌ అధికారులే ఆ రిమాండ్‌ నివేదికలో వెల్లడించారు. లేదంటే రాజ్‌ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతోనే సిట్‌ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది. 

ఇక అసలు విషయం ఏమిటంటే... రాజ్‌ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్‌ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్ర­మంగా నిధులు తరలించారని సిట్‌ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునా­మాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్‌ 403, ప్లాట్‌ నంబర్‌ 9)తో రిజిస్టర్‌ అయ్యాయి. 

అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్‌ ఐడీ (accounts@­wshanviinfraprojects.­com)­నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్‌ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్‌ ఇప్పించారు. 

అనంతరం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా చేశారు. ఇక కేశినేని చిన్ని బినామీ కంపెనీ ‘ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌’కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీశారు. కేశినేని చిన్ని ముసుగులో ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారు. మరి రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్‌ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం.  అంటే ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్‌ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది.   

మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని రూపొందించిన ఫైల్‌పై చంద్రబాబు, కొల్లు రవీంద్ర చేసిన డిజిటల్‌ సంతకాలు  

మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రపై 2023 అక్టోబర్‌ 28నసీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement