వ్యవసాయ రంగం తరువాత సేవా రంగంలోనే అత్యధిక ఉపాధి
2023–24లో జాతీయ సగటు 29.7 శాతమైతే..
ఏపీలో 31.8 శాతం మందికి సేవా రంగంలో ఉపాధి
78 లక్షల మంది సేవా రంగంలో ఉపాధి పొందారు
హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంలోనే 31.4 శాతం ఉపాధి
ఆ తరువాత రవాణా, నిల్వ రంగంలో 15.7 శాతం ఉపాధి
నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి
సాక్షి అమరావతి: ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ 2023–24 ఆరి్థక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషాతూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఏపీలో వ్యవసాయ రంగం తరువాత 2023–24లో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు నివేదిక పేర్కొంది. ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉందని నివేదిక తెలిపింది.


2023–24లో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన 29.7 శాతం ఉండగా.. ఏపీలో 31.8 శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందినట్టు నివేదిక పేర్కొంది. 2011–12లో సేవల రంగంలో 27.7 శాతం ఉపాధి కల్పిస్తే.. 2023–24లో ఏపీలోని సేవల రంగంలో 78 లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాటా 31.8 శాతానికి పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. 2011–12లో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్‌లో ఉండగా 2023–24లో మూడో స్థానానికి పడిపోయిందని, కర్ణాటక రెండో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారగా.. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది.


