
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్‌ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు.
భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్‌ఎస్‌ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.