పల్స్ పోలియో అభియాన్‌ను విజయవంతం చేయండి
కోలారు : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో అభియాన్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకా వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లు, జనరద్దీ ఉన్న ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు టీకా వేయాలన్నారు. 22 నుంచి 24 వరకు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలన్నారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, నగరాభివృద్ధి, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేసి టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ బాగేవాడి, డిప్యూటీ కలెక్టర్ మంగళ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


