
మంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారుల విచారణ మరో మలుపు తిరిగింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుని ఆరోపణల మేరకు పలు ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు జరపగా, అనుమానాస్పద మృతదేహాలకు సంబంధించిన ఖచ్చితమైన ఆనవాళ్లు లభించలేదు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)నకు తాజాగా స్థానికంగా చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు, తప్పిపోయిన వ్యక్తులు, మృతదేహాలను అనధికారికంగా పారవేయడానికి సంబంధించి 30కి పైగా ఫిర్యాదులు అందాయి.

‘మృతదేహాలను పారవేశారు’
ధర్మస్థళ ఆలయానికున్న మతపరమైన పవిత్రతను కించపరచడానికే ఈ వివాదం సృష్టించారని కూడా వాదనలు వినిపిస్తున్న తరుణంలో, స్థానిక గ్రామ పంచాయతీ , పోలీసుల ప్రమేయంతో అనధికారికంగా ఇక్కడ మృతదేహాలను పారవేశారని సిట్ అధికారులకు అందిన ఫిర్యాదులలో ఆరోపణలున్నాయి. అలాగే ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో భారీ కుట్ర జరిగిందని కొంతమంది ఫిర్యాదుదారులు సిట్ అధికారులకు తెలిపారు.
సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి సమావేశం
దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు, ఫిర్యాదుల విశ్వసనీయతను నిర్ణయించడానికి సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో ఆయనతో పాటు పోలీసు సూపరింటెండెంట్లు జితేంద్ర కుమార్ దయామా, సీఏ సైమన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘మాకు 30 కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. అవి నిరాధారమైనవని తేలితే, వాటిని పరిగణలోకి తీసుకోం. అయితే పలువురు ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నాయి. ఇందుకు మరింత సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది’ అని ఒక సీనియర్ అధికారి అన్నారు.

అడవుల్లో అస్థిపంజర అవశేషాలు
మరోవైపు ఇటీవల ఒక కీలక సాక్షి, 2012లో అత్యాచారం, హత్యకు గురైన సౌజన్య మామ విట్టల్ గౌడ సిట్ అధికారులను బంగ్లెగుడ్డె అడవులకు తీసుకువెళ్లి, మానవ అస్థిపంజర అవశేషాలను చూపించాడు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పరిశీలించగా, మరిన్ని మానవ అవశేషాలు కనుగొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే దీనిపై చట్టపరమైన అభిప్రాయం కోరనున్నట్లు సిట్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా సిట్‌కు అందిన ఫిర్యాదులను ముందుగా స్థానిక పోలీసులకు అప్పగిస్తామని అన్నారు. అలాగే బంగ్లెగుడ్డె అడవుల్లో తవ్వకాలు జరపాలంటే అటవీ శాఖకు సమాచారం అందించాల్సి ఉంటుందని సిట్ అధికారులు తెలిపారు.