
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గని భారత్ .. రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రష్యాకు పంపించింది. ఈ నెలాఖరులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా మాస్కోకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
అజిత్ దోవల్ రష్యా పర్యటన ముందుగానే ఖరారైంది. అయితే, రష్యాతో భారత్ సంబంధాల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరుణంలో అజిత్ దోవల్ పర్యటన చర్చకు దారి తీసింది.
అజిత్ దోవల్ తన పర్యటనలో భాగంగా రష్యాతో వ్యూహాత్మక ఒప్పందం,రక్షణ సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ కథనాల్ని వెలువరించింది. అదే సమయంలో భారత రాయబారి వినయ్ కుమార్, రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి కల్నల్-జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్ మధ్య మాస్కోలో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి భారత్-రష్యాలు తమ నిబద్ధతను చాటిచెప్పాయి.
రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. భారత రాయబారి అంతర్జాతీయ రక్షణ సహకారానికి బాధ్యత వహిస్తున్న కల్నల్-జనరల్ ఫోమిన్‌తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీలో రక్షణ రంగంలో ద్వైపాక్షిక పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించాయి. భారత్-రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది.