
జెరూసలేం: గాజా ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకునేందుకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గాజాలోని మూడొంతుల ప్రాంతం ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. తాజాగా, బందీల విడుదలపై హమాస్ సానుకూలంగా లేకపోవడం కారణంగా నెతన్యాహూ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మిలటరీ ఆపరేషన్ ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించనుంది. హమాస్ బందీలను దాచి ఉంచిన ప్రాంతం కూడా ఇందులో ఉందని మీడియా అంటోంది.
గాజా పూర్తి స్థాయి ఆక్రమణ ప్రయత్నాలపై నెతన్యాహూ కార్యాలయం స్పందించలేదు. సైనిక చర్యపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇజ్రాయెల్ సీని యర్ అధికారిని ఉటంకిస్తూ ‘చానెల్ 12’ పేర్కొంది. ‘హమాస్ పూర్తిగా లొంగిపోకుండా మిగతా బందీలను విడుదల చేయదు. మేం కూడా లొంగిపోము. ఇప్పుడు ఎలాంటి చర్యా తీసుకోకుంటే బందీలు ఆకలితో చనిపోతారు, గాజా హమాస్ నియంత్రణలోనే ఉంటుంది’అని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రణాళికలపై పాలస్తీనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.