
భారత్‌పై ఆక్రోశం వెళ్లగక్కిన అగ్రరాజ్యాధినేత
25% కొత్త దిగుమతి టారిఫ్‌లకు అదనంగా సుంకాలు విధిస్తానన్న ట్రంప్
తమకన్నా రష్యాతోనే భారత్ ఎక్కువ
వాణిజ్యం చేస్తోందంటూ మండిపాటు
న్యూయార్క్/మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితితో భారత్‌పై తన ఆగ్రహాన్ని టారిఫ్‌ల రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ మంగళవారం ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్‌పై తన అక్కసును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని సీఎన్‌బీసీ స్క్వాక్ బాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు.
భారత్ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్ మరోమారు నోరుపారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాగి్నకి ఆజ్యంపోస్తోందని ఆరోపించారు. ‘‘భారత్ ఇప్పటికీ మంచి వాణిజ్య భాగస్వామిగా ఎదగలేకపోయింది. భారత్ మాతో పెద్దస్థాయిలో వ్యాపారం చేస్తోందిగానీ మేం వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు.
అందుకే ఇప్పటికే ఇటీవల 25 శాతం టారిఫ్‌ను విధించా. మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా. దీనికి ప్రధాన కారణం వాళ్లు రష్యా ముడి చమురును కొనుగోలు చేయడమే. అక్కడ ఇంధనాన్ని కొంటూ రష్యాకు నగదు ఇంధనాన్ని సమకూర్చుతున్నారు. ఆ ఇంధనంతో రష్యా యుద్ధయంత్రంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ పద్దతి వాళ్లకు నచ్చుతుందేమోగానీ నేనైతే అస్సలు సంతోషంగా లేను’’అని అన్నారు.
భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా సరకులపై భారత్ అత్యంత ఎక్కువ టారిఫ్‌లను మోపుతోంది. మేం టారిఫ్‌లు పెంచడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం’’అని చెప్పారు. ‘‘మా ఈ సుంకాల మోత తర్వాత భారత్ దిగిరావొచ్చు. మా సరకులపై సున్నా దిగుమతి సుంకాన్ని ఆఫర్‌చేయొచ్చు. కానీ ఇది మాకు ముఖ్యం కాదు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్ల అంశమే మాకు ప్రధానం’’అని ట్రంప్ స్పష్టంచేశారు.