
దిస్పూర్: ముందు గుండెపోటన్నారు. ఆ తర్వాత దొంగతనమన్నారు. ఏం జరిగిందో తెలియక పోలీసులు కంగుతిన్నారు. చివరకు తమ్ముడొచ్చి తన అన్నది సహజ మరణం కాదని, హత్య జరిగిందనే ఆధారాలు బయటపెట్టడంతో అస్సాం వ్యాపారవేత్త హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉత్తమ్ గోగోయ్ హత్య కేసులో అయన భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె, ఇద్దరు మైనర్ యువకులు అరెస్టు అయ్యారు.
అస్సాంలోని లాహన్ గావ్ ప్రాంతంలో 38 ఏళ్ల వ్యాపారవేత్త ఉత్తమ్ గొగోయ్ అలియాస్ శంకై తన నివాసంలో మృతదేహంగా కనిపించిన కేసులో అతని భార్య, మైనర్ కుమార్తెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు దీబ్రుగఢ్ జిల్లా సీనియర్ ఎస్పీ వీవి రాకేశ్ రెడ్డి తెలిపారు.
గొగోయ్ కుమార్తె 9వ తరగతి విద్యార్థిని. తండ్రి హత్యలో తన పాత్ర ఉన్నదని నేరం అంగీకరించిందని చెప్పారు. మరో సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. గొగొయ్ను హత్య చేసేందుకు అతని భార్య,కుమార్తె గతంలో పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా, అతని ప్రాణాలు తీశారు. ఈ ఘటన వెనుక అసలు మోటీవ్ ఏమిటన్నది ఇంకా దర్యాప్తులో ఉంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్య చేయడానికి ఇద్దరు మైనర్ కాంట్రాక్ట్ కిల్లర్లకు భార్య, కుమార్తె కలిసి లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గొగొయ్ హత్య జూలై 25 ఉదయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుటుంబ సభ్యులు గుండెపోటుతో గొగోయ్ మరణించాడని పేర్కొన్నారు. కానీ, మృతదేహంపై గాయాలు ఉందని మృతుని సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించారు.
గొగోయ్ సోదరుడు మాట్లాడుతూ.. ఉదయం 8:30 ప్రాంతంలో ఇంటికి వెళ్లాను. అప్పటికే ఉత్తమ్ చనిపోయి ఉన్నాడు. చెవిపై గాయాలున్నాయి. మొదట దొంగతనంగా భావించాం. గుండెపోటుతో మరణిస్తే ఈ గాయాలు ఎలా వస్తాయి? ఇది ముందుగా పథకం వేసిన హత్యే. దోషులకు కఠిన శిక్ష వేయాలి" అని చెప్పారు.
ఈ అరెస్టుల నేపథ్యంలో బర్బరూ ప్రాంతంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేయాలని, హత్యకేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.