
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.
టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్‌కు వైఎస్సార్‌సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.


టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.
టీడీపీ నాయకులతోనే సంబంధాలు
వెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది.
