మాట మార్చిన ట్రంప్‌.. రష్యా విషయంలో పరువు పోయినట్టేనా? | Trump Comments On uranium and fertiliser trade with Moscow | Sakshi
Sakshi News home page

మాట మార్చిన ట్రంప్‌.. రష్యా విషయంలో పరువు పోయినట్టేనా?

Aug 6 2025 9:08 AM | Updated on Aug 6 2025 11:44 AM

Trump Comments On uranium and fertiliser trade with Moscow

వాషింగ్టన్‌: రష్యా నుంచి అమెరికా దిగుమతుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుక మడతేశారు. రష్యా నుంచి యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదని ట్రంప్‌ చేతులెత్తేసి అందరి ముందు నవ్వుల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కదా.. మరి ఇప్పుడు అమెరికాపై ఎవరు సుంకాలు విధించాలి అని ప్రశ్నిస్తున్నారు.

లాస్ ఏంజిల్స్‌లో 2028​కి సంబంధించి ఒలింపిక్స్ నిర్వహణపై వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌ మరోసారి సుంకాల విషయంలో స్పందించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున 25 శాతం సుంకాలు విధిస్తున్నానని గతంలో ప్రకటించిన ట్రంప్‌.. ఇప్పుడు మాట మార్చి.. అలాంటి శాతాలేవీ తాను చెప్పలేదన్నారు. దానిపై కసరత్తు చేస్తున్నామని, ఏం జరుగుతుందో చూస్తామని తెలిపారు. రేపు రష్యాతో సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఓ విలేకరి రష్యా నుంచి అమెరికా దిగుమతుల సంగతేంటని ప్రశ్నించగా.. మాస్కో నుంచి వాషింగ్టన్‌ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై తనకు అవగాహన లేదన్నారు. దిగుమతుల విషయం తెలుసుకుంటానని చెప్పారు.

అమెరికా-రష్యా వాణిజ్యం
రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం, యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుండి అమెరికా 24.51 బిలియన్ల డాలర్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోనే వాషింగ్టన్ మాస్కో నుండి 1.27 బిలియన్ల డాలర్ల విలువైన ఎరువులను, 624 మిలియన్ల డాలర్ల విలువైన యురేనియం, ప్లూటోనియం దాదాపు 878 మిలియన్‌ డాలర్ల విలువైన పల్లాడియంను దిగుమతి చేసుకుంది.

ట్రంప్‌నకు నిక్కీ హేలీ హితవు
అయితే, రష్యాతో వాణిజ్యం చేస్తున్న కారణంగా భారత్‌పై సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యాతో వాణిజ్యం ఆపకపోతే టారిఫ్‌లు మరింత పెంచుతానని హెచ్చరికలు సైతం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీరుపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నాయకురాలు నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ వంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని హితవు పలికారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా అని ప్రశ్నించారు. రష్యా, ఇరానియన్‌ నుంచి చైనా (China) అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారని ట్రంప్‌ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement