
అమెరికాలో పెట్టుబడులకు భారతీయుల ఆసక్తి
ఈబీ–5 వీసా దరఖాస్తుల్లో భారీ పెరుగుదల
దీన్ని రద్దు చేసే ఎత్తుగడతోనే ‘ట్రంప్ కార్డు’
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పుడున్న ఈబీ–5 వీసా స్థానంలో ట్రంప్ తెస్తానన్న ‘గోల్డ్ కార్డ్’ నేటికీ పట్టాలెక్కలేదు. కానీ, అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయులు గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం చేసే ఈబీ–5 దరఖాస్తులు రయ్యిన దూసుకుపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేనంతగా మనదేశం నుంచి ఎక్కువ సంఖ్యలో ఈబీ–5 వీసాకు దరఖాస్తులు వెళ్లాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక విద్యార్థి, తాత్కాలిక వర్క్ వీసాలపై నియంత్రణలు కఠినతరం కావటానికి ముందు.. 2024 ఏప్రిల్ నుండే ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు వాషింగ్టన్‌లోని అమెరికన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ అలయెన్స్ (ఎ.ఐ.ఐ.ఎ.) డేటా చెబుతోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే (2024 అక్టోబర్–2025 జనవరి. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30తో ముగుస్తుంది) 1,200 మందికి పైగా భారతీయులు ఈబీ–5 వీసా కోసం ఫామ్ ఐ–526ఈ దరఖాస్తు చేశారు. ఈ సంఖ్య 2023 మొత్తం ఏడాది సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.
శాశ్వత నివాసానికి హామీ
ఈబీ–5 వీసాకు డిమాండు పెరగటానికి హెచ్1–బి, గ్రీన్ కార్డ్ సహా ఇతర ఇమిగ్రేషన్ కేటగిరీల్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటమూ ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పలు అంచనాల ప్రకారం, ప్రస్తుతం యూఎస్‌లో కోటీ 10 లక్షలకు పైగా ఇమిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాశ్వత నివాసానికి ఈబీ–5 వీసా ఒక వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఇన్వెస్ట్ ఇన్ ది యూఎస్‌ఏ (ఐ.ఐ.యూఎస్‌ఏ) ఆధ్వర్యంలోని వాషింగ్టన్ ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం సమాచారం ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో (2023 అక్టోబర్ –2024 సెప్టెంబర్) భారతీయులకు 1,428 ఈబీ–5 వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 815 మాత్రమే.
ప్రాంతాన్ని బట్టి పైకం..
1992 నుంచి అమెరికా ఈబీ–5 వీసాలను ఇవ్వటం ప్రారంభించింది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం వీటిని సృష్టించారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతం లేదా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో (టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా – టి.ఇ.ఎ.) 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.88 కోట్లు), తక్కిన ప్రాంతాల్లో కనీసం 10.50 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టే వలసదారులకు ఈబీ–5 వీసా (గ్రీన్ కార్డులు) ఇస్తారు. ఈ వీసా ఉంటే.. పెట్టుబడి పెట్టేవాళ్లు, వారి జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు ఉండే వారి పెళ్లికాని పిల్లలకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. త్వరలో వీటిని.. ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తారు.
అమెరికాలో నుంచే దరఖాస్తు
హెచ్–1బీ వీసాలపై ఉన్న విద్యార్థులు, పని చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులు తమ దేశానికి వెళ్లకుండానే ఈబీ–5ను అమెరికాలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం యూఎస్‌లో హెచ్–1బీ లేదా విద్యార్థి వీసా వంటి వలసేతర హోదాలపై ఉన్న భారతీయ పౌరులు, కొత్త నిబంధనల ప్రకారం ఐ–526ఈ ఫారం దాఖలు చేసిన సమయం నుండి 3–6 నెలల్లోపు వర్క్, ట్రావెల్ పర్మిట్లను పొందటం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ పర్మిట్ సాధారణంగా వారి ఈబీ–5 గ్రీన్ కార్డ్ ఆమోదం పొందేవరకు చెల్లుబాటులో ఉంటుంది.
ఈబీ-5 వీసా..
కనీస పెట్టుబడి టి.ఇ.ఎ.లకు రూ. 6.88 కోట్లు, నాన్–టి.ఇ.ఎ.లకు రూ.9 కోట్లు.
కనీసం 10 ఫుల్ టైమ్ ఉద్యోగాల కల్పన జరగాలి.
2027 వరకు చట్టబద్ధమైన భరోసా.
యూఎస్‌లో ఉన్న భారతీయులు అక్కడి నుండే దరఖాస్తు చేసుకోవచ్చు
ట్రంప్ గోల్డ్ కార్డు..
రూ. 43.5 కోట్లు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి.
విధి విధానాలు ఖరారు కాలేదు.
చట్టం రూపొందలేదు.