ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్‌, చైనా సైనికులు: జెలెన్‌స్కీ | Russia-Ukraine War, Zelenskyy Says Russia Gets Support From China And Pakistan, More Details Inside | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్‌, చైనా సైనికులు: జెలెన్‌స్కీ

Aug 5 2025 12:10 PM | Updated on Aug 5 2025 12:42 PM

Zelenskyy Says Russia gets support from China and Pakistan

కీవ్‌: రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున చైనా, పాకిస్తాన్‌ దళాలు పాల్గొంటున్నాయని వ్యాఖ్యానించారు. వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్బంగా జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు.  చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాకిస్తాన్‌తో సహా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు మా దేశ దళాలు గుర్తించాయి. ఇందుకు ఉక్రెయిన్‌ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, వోవ్‌చాన్స్క్‌ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఫ్రంట్‌లైన్‌లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్‌ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్‌లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.

మరోవైపు.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలను పాక్‌ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెలెన్‌స్కీ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్‌ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్‌స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిని బీజింగ్‌ అప్పుడే ఖండించింది. మరోవైపు.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. రష్యాకు ఆయుధాలను, సైనికులను పంపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement