
అన్యాయాలను నిలదీసిన తండ్రిని తన చిన్నతనంలోనే వడ్డీవ్యాపారులు గుండాల సాయంతో హత్య చేయించడం కళ్లారా చూశారాయన. అయితే ఆ ఘటనే శిబుసోరెన్ జీవితాన్ని మార్చేసింది. గిరిజనుల తరఫున పోరాటం తీవ్రతరం చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. స్వరాష్ట్ర సాధన, గిరిజన సంక్షేమమే లక్ష్యంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సగానికిపైనే గడిచిపోయింది.
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం(ఆగస్టు 4, 2025) తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతిపై తనయుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు.
గౌరవనీయులైన డిషోమ్ గురు(Dishoom Guru) మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకంతా శూన్యంగా కనిపిస్తోంది అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు హేమంత్. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఆదివాసీల, పేదల, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అంటూ వ్యాఖ్య చేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం మరువలేనిది’ అని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం శిబు సోరెన్ మృతికి నివాళులర్పిస్తున్నారు.


డిషోమ్ గురుగా..
శిబు సోరెన్‌ను ఆయన మద్దతుదారులు డిషోమ్ గురూ అని సంబోధిస్తుంటారు. డిషోమ్ గురూ.. అంటే పోరాటాలకు సిద్ధంగా ఉండే గురువు.. భూమి పుత్రుడు, దేశ నాయకుడు అనే అర్థాలు వస్తాయి. ఆదివాసీల హక్కుల కోసం, భూదోపిడీ.. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చి పెట్టాయి.
1973లో జేఎంఎం ఆవిర్భవిస్తే.. 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా ఆయనే దానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా, స్వరాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. అయితే ఆ మూడు పర్యాయాల్లోనూ రాజకీయ ఒడిదుడుకులతో ఆయన ఐదేళ్ల టర్మ్ పూర్తి చేసుకోకపోవడం గమనార్హం.
2005లో కేవలం 9 రోజులు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. రెండోసారి.. అగష్టు 2008లో సీఎంగా బాధ్యతలు చేపట్టి జనవరి 2009లో ఆ పదవి నుంచి దిగిపోయారు. తిరిగి అదే ఏడాది డిసెంబర్‌లో సీఎంగా బాధ్యత చేపట్టినా.. ఐదు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే..
1980 నుంచి 2005 మధ్య ఆయన లోక్‌సభ ఎంపీగా.. అటుపై మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఆయన పని చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా పని చేశారు.

తండ్రి హత్య చూసి..
1944 జనవరి 11న నెమ్రా జిల్లా(ప్రస్తుత జార్ఖండ్)లోని సంతల్ గిరిజన కుటుంబంలో జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీవ్యాపారుల గుండాల చేతుల్లో తండ్రి దారుణ హత్యకు గురికావడం కళ్లారా చూశారాయన. బడీ ఈడు పిల్లాడిగా ఉన్న ఆయన్ని ఆ ఘటనే రాజకీయ పోరాటాల వైపు అడుగులేయించింది. ఆదివాసీల హక్కుల కోసం ఉదృత పోరాటాన్ని చేయించింది.

18 ఏళ్ల వయసులో సంతల్ నవయువక్ సంఘ్‌ను స్థాపించి.. 1972లో బెంగాల్ మార్కిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట ఏకే రాయ్, బినోద్ బీహారీ మహాటో నేత కుర్మి మహాటోతో శిబుసోరెన్ చేతులు కలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన స్వరాష్ట్ర ఉద్యమం చేపడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు. అలా మొదలైన పోరాటం.. 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పాటుతో(బీహార్ నుంచి విడిపోయి) నెరవేరింది. ప్రజల కోసం నిర్భయంగా, నిబద్ధతతో నిలబడిన నాయకుడిగా గుర్తింపు పొందారాయన.

కుటుంబమంతా రాజకీయాల్లోనే..
రూపీ సోరెన్‌ను జనవరి 1, 1962లో వివాహమాడారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. కుమార్తె అంజని జేఎంఎం ఒడిషా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు బసంత్ సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మరో కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.

శిబుసోరెన్ మీడియా ముఖంగా నవ్వే సందర్భాలు చాలా అరుదు. అందకు ఆయన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉండేది. 15వ ఏట తండ్రి మరణం, ఆకలి, నిరుద్యోగం లాంటి సమస్యలు వల్ల తాను నవ్వడం మానేశాని తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుండేవారాయన. రాజకీయాల్లో సాదాసీదా నేతగానూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. శిబు సోరెన్.. జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అయితే అదే సమయంలో వివాదాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది కూడా. గతంలో ఆయనపై హత్యాయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. అలాగే చిరుదిహ్ ఊచకోత, మాజీ కార్యదర్శి శశినాథ్ జా హత్య కేసులతో పాటు అక్రమాస్తుల ఆరోపణలు ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కించాయి.
:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం