
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున భారతదేశ వస్తువులపై సుంకాలను గణనీయంగా పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన దరిమిలా, భారత్ పలు ఉదాహరణలతో అమెరికా తీరును ఎండగట్టింది. ఉక్రెయిన్ వివాదం అనంతరం రష్యా నుండి దిగుమతులు చేసుకోవడం ప్రారంభించినప్పుడు, అమెరికా అటువంటి దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ గుర్తుచేసింది. ముడి చమురు ఎగుమతులపై భారత శుద్ధి కర్మాగారాలను ట్రంప్ టార్గెట్ చేయడాన్ని యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకించింది.
భారతదేశం దిగుమతులు ప్రపంచ మార్కెట్‌కు అవసరమైనప్పటికీ, భారత్‌ను విమర్శిస్తున్న దేశాలు రష్యాతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాతో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉన్న దేశాల జాబితాను ప్రకటించింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కలిగి ఉందని, అదనంగా 2023లో 17.2 బిలియన్ యూరోల సేవల వాణిజ్యాన్ని అంచనా వేసిందని పేర్కొంది. ఇది ఆ ఏడాది లేదా ఆ తర్వాత రష్యాతో భారత్ జరిపిన వాణిజ్యం కంటే చాలా అధికం అని పేర్కొంది.
Statement by Official Spokesperson⬇️
🔗 https://t.co/O2hJTOZBby pic.twitter.com/RTQ2beJC0W— Randhir Jaiswal (@MEAIndia) August 4, 2025
యూరప్-రష్యా వాణిజ్యంలో ఇంధనం మాత్రమే కాకుండా, ఎరువులు, మైనింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు , యంత్రాలు, రవాణా పరికరాలు కూడా ఉన్నాయని భారత్ తెలిపింది. ఇక యునైటెడ్ స్టేట్స్ విషయానికొస్తే అమెరికా.. రష్యా నుండి యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉందని భారత్ గుర్తుచేసింది. నాడు అమెరికా ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు భారతదేశం చేసే ఇంధన దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ పేర్కొంది.
అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఆగస్టు 9 నాటికి రష్యా.. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఆగస్టు ఏడు నుండి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 25 శాతం దిగుమతి సుంకాన్ని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.