తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్‌ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ! | how Ukraine Spiderweb Drone Strikes Russia | Sakshi
Sakshi News home page

తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్‌ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ!

Jun 3 2025 9:11 AM | Updated on Jun 3 2025 10:49 AM

how Ukraine Spiderweb Drone Strikes Russia

కీవ్‌: ఆపరేషన్‌ స్పైడర్స్‌ వెబ్‌. వీడియోగేమ్‌ ఆడుతున్నంత అలవోకగా రష్యా భూభాగం 4 వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌ చేపట్టిన కోవర్ట్‌ మిలటరీ ఆపరేషన్‌. ఇప్పుడిదే ప్రపంచ నేతల్లో హాట్‌ టాపిక్‌. ఎందుకంటే?.

2022 నుంచి ప్రారంభమైన ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఓ వైపు శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమంటూ ఉక్రెయిన్‌ భీకర దాడికి తెగబడింది. ఆపరేషన్‌ స్పైడర్స్‌ వెబ్‌ పేరుతో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఊహించని పరిణామంలో 40 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా మాస్కో 60వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.

అయితే, నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్‌ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యంలో ఉక్రెయిన్‌ బీభత్సం ఎలా సృష్టించిందనేదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.

 రహస్యంగా రష్యాలోకి డ్రోన్ల తరలింపు
ఈక్రమంలో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి జరిపిన తీరుపై జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. మూడు టైమ్‌ జోన్లు. 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు రష్యా వైమానిక స్థావరాలు. ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్‌ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు‌ 1200 డాలర్లు ఖర్చుతో మొత్తం 117 డ్రోన్లను సెమీ ట్రైలర్‌ ట్రక్కుల్లో నింపింది. ఇందుకోసం ట్రక్కును ప్రత్యేకంగా చెక్కతో డిజైన్‌ చేయించింది. 

మనుషుల అవసరం లేకుండానే
మనుషుల సహాయం లేకుండా ఉక్రెయిన్‌లో ఉండి.. రష్యాలోకి చొరబడ్డ ట్రక్‌ డోర్లును ఓపెన్‌ చేయడం, ట్రక్కు లోపల ఉన్న డ్రోన్‌లు లోపలి నుంచి ఎగురుకుంటూ బయటకు రావడం, రష్యా బాంబర్‌ విమానాలపై మెరుపు దాడి చేయడం ఇదంతా ఉక్రెయిన్‌ రిమోట్‌ కంట్రోల్‌తో చేసింది. ఫలితంగా కొన్ని గంటల వ్యవధిలో రష్యా 40 యుద్ధ విమానాలు సర్వనాశనం చేసింది. ఈ హాని విలువ సుమారుగా 7 బిలియన్ (దాదాపు రూ.60వేల కోట్లకు)పైగా ఉన్నట్లు అంచనా.

రష్యన్ భద్రతా సంస్థకు సమీపం నుంచి 
ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇర్కుట్‌స్క్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఆపరేషన్‌ను రష్యన్ భద్రతా సంస్థ (FSB) కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్‌ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ   వెల్లడించారు. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన  అతిపెద్ద దాడిని చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్‌గా అభివర్ణించారు.

 

ఈ దాడిలో మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్న సైనిక విమానాల్లో  టు-95, టు-22ఎం, టు-160 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు ఏ-50 విమానం కూడా ఉంది.  ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబర్లలో సుమారు 34శాతం నష్టం జరిగింది.

జెలెన్‌స్కీ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడి కోసం 18 నెలలపాటు ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందు, ఆపరేషన్‌లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి ఉక్రెయిన్‌ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ విమానాల నష్టం వల్ల ఉక్రెయిన్‌పై విధ్వంసకర క్షిపణి దాడులను అందించగల సామర్ధ్యం రష్యాకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement