రష్యాకు రూట్‌ క్లియర్‌ | International Olympic Committee lifts suspension on Russia | Sakshi
Sakshi News home page

రష్యాకు రూట్‌ క్లియర్‌

Jul 9 2026 4:00 AM | Updated on Jul 9 2026 4:00 AM

International Olympic Committee lifts suspension on Russia

సస్పెన్షన్‌ ఎత్తివేసిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 

సొంత జెండాతో 2028 ఒలింపిక్స్‌ బరిలోకి 

ఐఓసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉక్రెయిన్‌

జెనీవా: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రష్యాకు మార్గం సుగమమైంది. గత కొన్నేళ్లుగా రష్యా ఒలింపిక్‌ కమిటీపై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బుధవారం ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో రష్యా ఎలాంటి ఆంక్షలు లేకుండా... తమ జాతీయ జెండా, జాతీయ గీతంతో బరిలోకి దిగనుంది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన పోటీల్లో రష్యా ప్లేయర్లు పాల్గొనడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిషేధం విధించింది. దీంతో 2022 నుంచి రష్యా ప్లేయర్లు తటస్థ ఆటగాళ్లుగా తమ దేశ జెండా లేకుండానే పోటీల్లో పాల్గొంటున్నారు. 

ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు ఆటగాళ్లను బాధ్యులను చేయడం తగదని... అథ్లెట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ వెల్లడించింది. ఐఓసీ నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. ఇది తమ అథ్లెట్ల హక్కుల పునరుద్ధరణ దిశగా పడిన కీలక అడుగు అని పేర్కొంది. మరోవైపు ఐఓసీ నిర్ణయంపై ఉక్రెయిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా దాడుల్లో తమ పౌరులు చనిపోతుంటే... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. 

నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఐఓసీ ప్రకటించినప్పటికీ... అథ్లెటిక్స్‌ (ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌), ఫిఫా వంటి పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలు మాత్రం రష్యాపై నిషేధాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. గతంలో రష్యాపై ఉన్న డోపింగ్‌ ఆరోపణల నేపథ్యంలో తిరిగి పోటీలకు వచ్చే రష్యా అథ్లెట్లకు కఠినమైన డోపింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆ్రస్టేలియా ఒలింపిక్‌ కమిటీ కోరింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రష్యా 20 స్వర్ణాలు సహా మొత్తం 71 పతకాలు సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలో రష్యాపై నిషేధం ఉండటంతో ఆ దేశ ప్లేయర్లు తటస్థ అథ్లెట్లుగా... ఒలింపిక్‌ జెండాతో బరిలోకి దిగారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement