రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్‌ నిఘా? | Alien Surveillance on Earth? Pentagons New UFO Files Spark Fresh Mystery | Sakshi
Sakshi News home page

రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్‌ నిఘా?

Jul 11 2026 1:28 PM | Updated on Jul 11 2026 1:31 PM

Alien Surveillance on Earth? Pentagons New UFO Files Spark Fresh Mystery

భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్‌) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్‌వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) తాజాగా విడుదల చేసిన ఫైల్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

"నేను 28 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నా. కానీ, ఎన్నడూ ఇలాంటి వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు’’ అని ఓ మాజీ సైనిక పైలట్‌ పేర్కొనడం, అణు ఆయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు సంచరించిన ఘటన, చైనా సమీపంలో తాజాగా నమోదైన వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ మేరకు.. తాజాగా పెంటగాన్‌ మొత్తం 40 రికార్డులను బహిర్గతం చేసింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో ఫైల్స్‌, మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్‌తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్‌బీఐ, ఇంధన శాఖ వంటి కీలక అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించింది. విడుదలైన వీడియోల్లో పశ్చిమ పసిఫిక్‌, అట్లాంటిక్‌, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో అమెరికా సైనిక కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలు ఉన్నాయి.

ఈ ఫైల్స్‌లో అత్యంత ఆసక్తికరమైనది 2019లో నమోదైన ఒక ఘటన. అమెరికా తూర్పు ప్రాంతంలో శిక్షణ విమానయానం నిర్వహిస్తున్న ఓ సైనిక పైలట్‌, మరో నలుగురు సిబ్బంది తమ విమానం కిందుగా అత్యంత వేగంగా కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గమనించారు. దాదాపు 10 నుంచి 15 సెకన్ల పాటు దానిని కెమెరాతో ట్రాక్‌ చేశారు. జూమ్‌ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే ఆ వస్తువు క్షణాల్లో కెమెరా పరిధి దాటి అదృశ్యమైంది. తర్వాత వీడియోను పరిశీలించగా అది దీర్ఘచతురస్రాకారంలో (Rectangular) ఉన్నట్లు గుర్తించారు.

దీనిపై సదరు పైలట్‌ తన నివేదికలో.. "ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఇలాంటి విమాన లక్షణాలున్న వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు" అని పేర్కొనడం విశేషం.

దెబ్బకు అణ్వాయుధ కేంద్రంలో లాక్‌డౌన్‌!
మరో ఫైల్‌లో అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని పాంటెక్స్‌ అణు ఆయుధ కేంద్రం వద్ద 2015లో చోటుచేసుకున్న ఘటనను వెల్లడించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది.. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజిన్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా గాల్లో కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గుర్తించారు. దాంతో మొత్తం అణు కేంద్రాన్ని వెంటనే లాక్‌డౌన్‌ చేసి, బైనాక్యులర్లతో ఆ వస్తువును వెంబడించారు. అయితే అది ఏమిటో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

చైనా సమీపంలో తాజా కదలికలు
ఈసారి విడుదలైన ఫైల్స్‌లో అత్యంత తాజా సమాచారం 2025లో చైనా సమీప సముద్ర ప్రాంతాల్లో నమోదైన ఘటనలకు సంబంధించినది. అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండ్‌కు చెందిన సెన్సార్లు ఎల్లో సీ ప్రాంతంలో ఆరు కోణాల నక్షత్రం ఆకారంలో కనిపించిన ఓ విచిత్ర వస్తువును గుర్తించాయి. మరో వీడియోలో తూర్పు చైనా సముద్రం (ఈస్ట్‌ చైనా సీ) ప్రాంతంలో నిమిషాల పాటు కదులుతున్న మరో గుర్తుతెలియని వస్తువు రికార్డైంది.

అలాగే 2023లో చిత్రీకరించిన మరో వీడియోలో.. ఓ రహస్య వస్తువు అమెరికా సైనిక విమానంలోని ఎలక్ట్రో-ఆప్టికల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్ల పనితీరును ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఏలియన్స్‌ ఉన్నాయా?
పెంటగాన్‌ విడుదల చేసిన ఫైల్స్‌లో.. ఈ వస్తువులు గ్రహాంతరవాసులకు చెందినవే అని ఎక్కడా నిర్ధారించలేదు. అదే సమయంలో అవి ఏమిటో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అందుకే వీటిని అధికారికంగా యూఏపీ (Unidentified Anomalous Phenomena)గా పేర్కొంది.

మిస్టరీ మరింత ముదిరింది
గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం యూఎఫ్‌వోలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను దశలవారీగా బయటపెడుతోంది. అయితే తాజా ఫైల్స్‌లో మాజీ సైనిక పైలట్‌ వాంగ్మూలం, అణు ఆయుధ కేంద్రంలో గుర్తుతెలియని వస్తువు సంచారం, చైనా సమీపంలో నమోదైన తాజా వీడియోలు ఉండటంతో.. "భూమిపై నిజంగానే ఏలియన్స్‌ నిఘా ఉందా? లేదంటే మనకు ఇంకా తెలియని అత్యాధునిక సాంకేతికతేనా?" అన్న ప్రశ్నలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ రహస్యం మాత్రం ఇంకా వీడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement