
టారిఫ్ వార్ దెబ్బ
2025–26లో రూ.5.27 లక్షల కోట్లు
జీటీఆర్‌ఐ సంస్థ అంచనా
రాయితీ రుణాలతో ఆదుకోవాలని సూచన
న్యూఢిల్లీ: భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) అమెరికాకు ఎగుమతులు 30 శాతం తగ్గి 60.6 బిలియన్ డాలర్లుగా (రూ.5.27 లక్షల కోట్లు) ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. 2024–25లో అమెరికాకు ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ (తక్కువ వడ్డీపై రుణ సాయం)ను పునరుద్దరించాలని ప్రభుత్వానికి సూచించింది.
అలాగే, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం, కొత్త ఎగుమతిదారులను నమోదు చేయించాలని పేర్కొంది. ఆసియాలో పోటీ ఎగుమతిదేశాలైన వియత్నాంపై 20%, బంగ్లాదేశ్‌పై 18%, ఇండోనేíÙయా, మలేషియా, ఫిలిప్పీన్స్‌పై 19%, దక్షిణ కొరియాపై 15% చొప్పున అమెరికా సుంకాలు విధించడం గమనార్హం. కనుక ఈ దేశాలతో పోటీపడడం భారత ఎగుమతిదారులకు కష్టమవుతుందని జీటీఆర్‌ఐ తెలిపింది. అమెరికా టారిఫ్‌ల నుంచి ఫార్మాస్యూటికల్స్, ఇంధన ఉత్పత్తులు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లకు మినహాయింపు ఉంది. కనుక ఇతర ఎగుమతులకు ఒత్తిళ్లు ఎదురవుతాయని పేర్కొంది.
గార్మెంట్స్, రత్నాభరణాల పరిశ్రమలకు ఇబ్బందులు
గార్మెంట్స్ (వ్రస్తాలు) తయారీదారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అల్లిన, నేత వస్త్రాలపై వరుసగా 38.9%, 35.3% చొప్పున టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో వీటికి సంబంధించి 2.7 బిలియన్ డాలర్ల ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు. టవల్స్, బెడ్ïÙట్‌లు వంటి 3 బిలియన్ డాలర్ల టెక్స్‌టైల్స్ ఎగుమతులు 34% టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
పాకిస్తాన్, వియత్నాం కంపెనీలకు ఈ విభాగంలో ప్రయోజనం లభిస్తుందన్నారు. అమెరికాకు ఎగుమతి అయ్యే 2 బిలియన్ డాలర్ల రొయ్యల ఎగుమతులపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాలు 27% టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్‌ను గతేడాది నిలిపివేశారు. రూ.15,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో దీన్ని తిరిగి ప్రారంభించాలని జీటీఆర్‌ఐ సూచించింది. ఐదేళ్ల పాటు సబ్సిడీపై రుణాన్ని ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు అందించాలి. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గి ఎగుమతిదారుల పోటీతత్వం పెరుగుతుంది’అని శ్రీవాస్తవ వివరించారు.
రంగంలోకి దిగిన ప్రభుత్వం
అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే టెక్స్‌టైల్స్, కెమికల్స్ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, మెరైన్, వ్యవసాయం తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులతో వాణిజ్య శాఖ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఆర్థిక సాయంతోపాటు చౌక రేట్లపై రుణ సాయాన్ని సమకూర్చాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు.