
డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో భారతీయ టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్ జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీర్ సింగ్ తలపై రెండుసార్లు బాటిల్‌తో దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీర్ సింగ్ క్యాబ్‌లోకి ఎక్కిన ఇద్దరు యువకులు లఖ్వీర్ సింగ్‌పై దాడికి దిగారు. గడచిన రెండు వారాల్లో ఐర్లాండ్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై జరిగిన మూడవ దాడి ఇది.
ఐర్లాండ్‌లోని డబ్లిన్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్లిన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం లఖ్వీర్ సింగ్ గత 23 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నాడు. పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి, లఖ్వీర్ సింగ్ తన క్యాబ్‌లో 20 ఏళ్ల వయసుగల గల ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. పాపింట్రీ వద్ద తమను దింపాలని వారు సింగ్‌కు చెప్పారు. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకున్నాక ఆ ఇద్దరు యువకులు సింగ్‌పై దాడికి దిగి, బాటిల్‌తో అతని తలపై కొట్టారు. అక్కడిని నుంచి వారు పారిపోతూ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అని గట్టిగా అరిచారని సింగ్ తెలిపారు.
దాడిలో తీవ్రంగా గాయడిన లఖ్వీర్ సింగ్‌కు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సింగ్ అత్యవసర సహాయం 999కి డయల్ చేశాడు. వారి సాయంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ ఘటన తరువాత లఖ్వీర్ సింగ్ తీవ్రంగా కుంగిపోయాడు. టాక్సీ డ్రైవర్‌గా తిరిగి కొనసాగడం చాలా కష్టమని భావిస్తున్నాడు. గడచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సింగ్ వాపోయాడు. ఈ ఘటన దరిమిలా తమ కుటుంబ సభ్యులు ఎంతో భయపడుతున్నారని అన్నాడు. ఆగస్టు ఒకటిన రాత్రి సుమారు 11:45 గంటలకు డబ్లిన్ 11లోని పాపింట్రీలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల ఒక వ్యక్తిని చికిత్స కోసం బ్యూమాంట్ ఆసుపత్రికి తీసుకువచ్చారని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్థానిక పోలీసులు తెలిపారు.