
ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. అదే మట్టిని మండపంలో పెట్టి పూజలు చేస్తారు. ఫల పుష్పాదులు సమర్పించి పండగ చేస్తారు. ఆ మట్టి.. మెళియాపుట్టి. ఇక్కడ ఇరవై ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా సీజన్ వచ్చిందంటే ప్రతిమల కోసం అంతా ఈ ఊరికి క్యూ కడతారు. విగ్రహాలతో పాటు దీపాలు ఇతర మట్టి సామగ్రిని కూడా తయారు చేయడం వీరి ప్రత్యేకత.
మెళియాపుట్టి:
వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కా వడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. మెళియాపుట్టిలో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక్కడ మట్టితో విగ్రహాలు, పూజా సామగ్రి తయారుచేస్తూ కళాకారులు బిజీగా బిజీగా గడుపుతున్నారు.
మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో నివాసముంటు న్న కొన్ని కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తాయి. ఏటా చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాల తయారీలో వారికి మంచి పట్టుంది. వీరు తయారు చేసిన ప్రతిమలను చూస్తే ప్రతిభను కొనియాడకుండా ఉండలేం.
చుట్టుపక్కల మండలాల నుంచి సైతం విగ్రహాలకు అడ్వాన్సులు ఇస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు విగ్రహాలు కూడా అందంగా..రంగురంగుల్లో ఆకర్షణీ యంగా తయారు చేయడంతో ఎక్కువగా మెళియాపుట్టిలోనే విగ్రహాలు కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మట్టి విగ్రహాలు తయా రు చేయడంతోనే వీరికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు.
కొంత మంది యువత వారికి కావాల్సిన విధంగా గణపతి విగ్రహాలు తయారు చేయించుకుంటారని విక్రయదారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను వినియోగించి తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుందని, అందుకే మట్టితోనే చేస్తున్నామని వారు చెబుతున్నారు. విగ్రహ తయారీలో కర్రలు, మట్టి, వరిగడ్డి, కొన్ని తాళ్లను మాత్రమే వారు వాడుతారు. 20 ఏళ్లుగా వీరు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఏటా కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు.
ప్రభుత్వ సహకారం కావాలి
మట్టితోనే విగ్రహాలు తయారు చేయడంతో సంతృప్తి చెందుతు న్నాం. మట్టితో విగ్రహాలు తయా రు చేయడం చాలా కష్టం. తయారు చేసిన తర్వాత చాలారోజులు ఉంచి అప్పుడు రంగులు వేయాలి. వాటిని భద్రపరచడారనికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. రేకుల షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలి.
– బూరగాన సవరయ్య, విగ్రహ తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం
మట్టి ప్రమిదలకు గిరాకీ ఎక్కువ
మట్టి ప్రమిదలు నిత్యం తయా రుచేస్తూనే ఉంటాం. వినాయక ఉత్సవాలకు అత్యధిక మండపాల్లో దీపారాధన చేస్తారు. వేల సంఖ్యలో ప్రమిదలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి వస్తే ఇంటిల్లిపాదీ నిమగ్నమై పనులు చేస్తాం.
– రేఖాన ఉమ, మెళియాపుట్టి గ్రామం