
న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాల గుండా వాణిజ్యంపై భారత్–చైనా మధ్య త్వరలో చర్చలు ప్రారంభం కానున్నట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని లిపూలేఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని షిప్‌కి లా పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా గతంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం జరిగేది.
ఐదేళ్ల క్రితం జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో ఈ వాణిజ్యం పూర్తిగా ఆగిపోయింది. భారత్, చైనా మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయానికొచ్చాయి. దానిపై త్వరలో చర్చలు ప్రారంభించనున్నాయి. మరోవైపు సరిహద్దు వివాదంపై భారత్, చైనా మధ్య వచ్చేవారం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో కీలక సమావేశం జరుగబోతోంది.