న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. మైమన్‌సింగ్ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై ఆచితూచి స్పందించింది. ఆ దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల కోణంలోనే దీనిని చూడాలని పేర్కొంది.
బంగ్లా విముక్తి పోరాటం దగ్గర్నుంచి ఆ దేశంతో సన్నిహిత, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పింది. ఫ్యాక్టరీ కారి్మకుడు దీపు చంద్ర దాస్‌ను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు క్రైస్తవులు, బౌద్ధులపైనా అతివాదులు పాల్పడుతున్న దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళన కరమైన అంశమన్నారు. మధ్యంతర ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా మైనారిటీల హత్యలు, భూ ఆక్రమణలు, దాడులకు సంబంధించిన ఘటనలు 2,900కు పైగా నమోదయ్యాయన్నారు. వీటిని మీడియా చేస్తున్న అతి ప్రచారంగానో లేదా రాజకీయ హింసగానో చూడరాదని జైశ్వాల్ తెలిపారు.


