breaking news
attacks on minorities
-
భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..
ముంబై: అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతికి నష్టం వాటిల్లేలా, ప్రధాని నరేంద్ర మోదీపై బురద చల్లేందుకే కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ కంగనా రనౌత్ సహా 61 మంది బాలీవుడ్ ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని 49 మంది ప్రముఖులు ప్రధానికి ఇటీవల లేఖ రాసిన లేఖకు వీరు కౌంటర్ ఇచ్చారు. మంచి పాలన అందించేందుకు, మనవత్వాన్ని చాటేందుకు, నిజమైన జాతీయవాదాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో గీత రచయిత ప్రసూన్ జోషి, డ్యాన్సర్ సోనల్ మాన్సింగ్, డైరెక్టర్లు మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి తదితరులు ఉన్నారు. మూకదాడులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చాలాసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. మూక దాడులపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్రాలకు మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. పేదలు నక్సలిజం, ఉగ్ర బాధితులుగా మారినప్పుడు ఈ మేధావు లంతా ఏం చేశారని ప్రశ్నించారు. భారత్‌ను విడగొట్టాలని కశ్మీర్లో వేర్పాటువాదులు డిమాండ్ చేసినప్పుడు, పాఠశాలలను దహనం చేస్తామని హెచ్చరించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయారన్నారు. జై శ్రీరాం అని నినదిస్తే హత్యలు చేసినప్పుడు, కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్లను, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నుంచి హిందువులను వెళ్లగొట్టినప్పుడు వీరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. -
తెలంగాణలో మాఫియాల రాజ్యం
తమ్మినేని వీరభద్రం సంగారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడం కాదని, సంపద పెరిగినంత మాత్రాన ప్రగతి సాధించినట్లు కాదన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు విజృంభిస్తూ దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. ప్రభుత్వమే యథేచ్ఛగా ఇసుక మాఫియాకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసుల అండతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిందన్నారు. ఎస్పీని వదిలేసి ఎస్ఐని బలిచేయడం వింతగా ఉందన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తప్పించుకుంటున్న కేసీఆర్‌ను పదేపదే ప్రశ్నిస్తున్న ఆచార్య కోదండరాంను అరెస్టుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.