ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్‌ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.
కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి.
ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్ నెక్ బ్లౌజ్ లేదా ఫుల్‌స్లీవ్ సిల్హౌట్‌లు ఈ చీర లుక్‌ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్‌వేరల్‌లోకి తీసుకొస్తుండటం విశేషం.
అంతేగాదు వెస్ట్‌కోట్‌లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్‌లు లేదా న్యూట్రల్ బేసిక్స్‌తో జత చేసి సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..)


