‘పాక్‌’లో కూలిన ట్యూషన్ సెంటర్ పైకప్పు.. 14 మంది మృతి! | Pakistan 14 Schoolchildren Killed After Tuition Center | Sakshi
Sakshi News home page

‘పాక్‌’లో కూలిన ట్యూషన్ సెంటర్ పైకప్పు.. 14 మంది మృతి!

Jul 1 2026 10:43 AM | Updated on Jul 1 2026 11:35 AM

Pakistan 14 Schoolchildren Killed After Tuition Center

లాహోర్‌: పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాహ్లా జిల్లా పరిధిలోని ఈద్గా బస్తీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక నివాస భవనం పైకప్పు కూలిపోయింది. అక్కడ ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడు నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు క్లాసులో ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు, స్థానికులు శిథిలాల నుండి 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనంపై కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, నాణ్యతా లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను, జిల్లా అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement