‘బోర్‌వెల్’ హీరో ‘ప్రిన్స్’.. 20 ఏళ్ల తర్వాత ఇలా.. | 20 Years After Miraculous Borewell Rescue, Haryana Prince Builds A New Life As A Plumber, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘బోర్‌వెల్’ హీరో ‘ప్రిన్స్’.. 20 ఏళ్ల తర్వాత ఇలా..

Jul 1 2026 8:57 AM | Updated on Jul 1 2026 10:19 AM

Borewell Rescue to Plumber The Inspiring 20-Year Journey of Kurukshetras Prince

అంబాలా: హర్యానాలోని అంబాలాకు చెందిన నాలుగేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయి మృతిచెందారు. 21 గంటలపాలు రెస్క్యూ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోయింది. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ‘ప్రిన్స్‌’ 2006లో బోరుబావిలో పడిపోయి, మృత్యుంజయునిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు నాటి ‘ప్రిన్స్‌’ ఉదంతాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘ప్రిన్స్‌’ ఏమి చేస్తున్నాడని ఆరా తీస్తున్నారు.

హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన ‘ప్రిన్స్’ అనే నాలుగేళ్ల బాలుడు 2006లో 60 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. ఈ నేపథ్యంలో దేశమంతా 50 గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. ప్రజలంతా ‘ప్రిన్స్‌’ కోసం  ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఆర్మీ రంగంలోకి దిగి, బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వి, పైపు ద్వారా బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. మృత్యుంజయుడిగా నిలిచిన ఆ ‘ట్యూబ్‌వెల్ బాయ్’ ఇప్పుడు 24 ఏళ్ల యువకుడయ్యాడు. చిన్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన పైపులనే ఇప్పుడు తన జీవనోపాధిగా మార్చుకుని, ఐటీఐ ద్వారా ప్లంబింగ్ కోర్సు పూర్తి చేసి, కొత్త జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాడు.

ఆనాటి భయంకరమైన సంఘటనను ప్రిన్స్ గుర్తుచేసుకుంటూ.. తన స్నేహితుడు అంగరేజ్‌తో కలిసి ఆడుకుంటుండగా ఒక ఎలుక వెంట పడ్డామని, అది గోనె సంచితో కప్పి ఉన్న బోర్‌వెల్‌లోకి దూరిందని చెప్పాడు. తాను ఆ సంచిపైకి దూకడంతో అమాంతం 60 అడుగుల లోతులోకి పడిపోయానని తెలిపాడు. మొదట తాడుకు బెల్ట్‌ కట్టి కిందకు పంపినప్పటికీ, అది వేడెక్కి ప్రిన్స్ చేతులు కాలడంతో తాడు పట్టుకోలేకపోయాడు. చివరకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 50 గంటల తర్వాత అతడిని రక్షించింది. భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది ప్రిన్స్ కల అయినప్పటికీ, హైట్ తక్కువ ఉండటం వల్ల ఆ అవకాశం కోల్పోయాడు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్లంబింగ్ వృత్తిని ఎంచుకుని, ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించడానికి ఒక స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. తనకు జీవితంలో ఎదురైన బోర్‌వెల్ ఘటన ఎప్పుడూ ఓడిపోకూడదనే గుణపాఠాన్ని నేర్పిందని, అదే ధైర్యంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నానని ప్రిన్స్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: 21 గంటల ప్రయత్నం వృథా.. బోరుబావి ఘటన విషాదాంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement