రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం | 7 Killed Over 15 Injured As Bus Catches Fire On Delhi-Mumbai Expressway In Rajasthan, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి సజీవదహనం

Jul 1 2026 7:20 AM | Updated on Jul 1 2026 9:32 AM

7 Killed Over 15 Injured as Bus Catches Fire on Delhi-Mumbai Expressway in Rajasthan

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై హరిద్వార్‌ నుంచి ఇండోర్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ లగ్జరీ స్లీపర్‌ బస్సు.. ముందు వెళ్తున్న ఓ భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లా కొల్వా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ రెస్ట్‌ ఏరియా సమీపంలో తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్‌ నుంచి ఇండోర్‌కు సుమారు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు లోయలోకి పడిపోగా, వెనుక భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఢీకొట్టడంతో అప్పర్‌ బెర్త్‌లపై ఉన్న ప్రయాణికులు కిందపడిపోయారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు మరింత వ్యాపించేలోపే కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే మంటల్లో చిక్కుకున్న ఏడుగురు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి దౌసా జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ట్రక్కును ఢీకొట్టిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్‌ నిద్రమత్తు లేదా మరో సాంకేతిక లోపం కారణమా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement