20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు? | Parliament Monsoon Session Likely From July 20, Key Bills, Cabinet Reshuffle Buzz And Political Tensions On Agenda | Sakshi
Sakshi News home page

20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

Jul 1 2026 10:27 AM | Updated on Jul 1 2026 11:12 AM

Parliament Monsoon Session Likely From July 20

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి. కానీ ఈసారి స్వల్ప వ్యవధిలోనే ముగిసే అవకాశం ఉంది. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ)దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో లభించిన విజయాలు, రాజ్యసభలో పెరిగిన సంఖ్యాబలంతో అధికార ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమైంది. అదే సమయంలో టీఎంసీ, శివసేన (యూబీటీ) ఎంపీల తిరుగుబాటు అంశాలు ఈ సమావేశాలలో కీలకంగా మారనున్నాయి.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని, బీజేపీ కొత్త బృందం ప్రకటనతో పాటే ఇది కూడా ఉండొచ్చని పీటీఐ పేర్కొంది. గత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో, ప్రభుత్వం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం పెంచేలా సరికొత్త ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే, జనాభా ప్రాతిపదికన స్థానాలను పెంచడంపై దక్షిణాది పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవే కాకుండా లోక్‌సభ సెక్యూరిటీ ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో భద్రతా అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తిరుగుబాటు చేసిన 20 మంది టీఎంసీ, ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలను ప్రత్యేక గ్రూపులుగా గుర్తించాలనే డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రాజకీయ సమీకరణాలు, కొత్త బిల్లుల రూపకల్పన మధ్య రాబోయే పార్లమెంట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement