
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్‌కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది.
పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్‌ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్‌కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్‌ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.